Reading Time: < 1 minute
Ajit Doval China Visit India China Border Talks Wang Yi

Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ సోమవారం చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై 25వ విడత చర్చల్లో పాల్గొననున్నారు. దోవల్, వాంగ్ యీలు మంగళవారం చర్చలు జరపనున్నారు. దాదాపు 2,488 కిలోమీటర్ల పొడవైన భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రతినిధుల చర్చల ప్రక్రియను 2003లో ప్రారంభించారు. ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యతో పాటు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ నెలలో బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో జరగబోతోంది. ఈ సమావేశానికి ముందు భారత్, చైనాల మధ్య ఈ హైలెవల్ మీటింగ్ జరుగుతోంది. బ్రిక్స్ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడకున్నా, షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరిసారిగా మోడీ, జిన్‌పింగ్‌లు గతేడాది ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా చివరిసారిగా సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలోనే దోవల్ చైనా పర్యటనకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటికి ముందు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం అత్యంత అవసరమని చెప్పారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌గిరి ప్రాంతంలోకి చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారనే నివేదిక నేపథ్యంలో జైశంకర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.