Reading Time: < 1 minute

సమస్యలు పరిష్కరిస్తాం.. సమ్మె విరమించి చర్చలకు రావాలి: ఆటో కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం విజ్ఞప్తి..

Caption of Image.

సిద్దిపేట జిల్లా, కోహెడ మండలంలో  రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ… ఆటో కార్మికులు సమ్మెను విరమించి, ప్రభుత్వంతో చర్చలకు రావాలని మంత్రి కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించినట్లే, ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

 2015 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని, ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ఇంకా వాహనాల ధరలను దృష్టిలో ఉంచుకుని చార్జీల పెంపుపై రవాణా శాఖ అధికారులు, కార్మిక ప్రతినిధులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక ‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.

పట్టణ నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే (రెట్రోఫిట్మెంట్) వారికి ప్రభుత్వం తరఫున రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనేవారికి కూడా సహకారం ఉంటుందని తెలిపారు.

ఆటో కార్మికుల కుటుంబాలకు కూడా రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
 

©️ VIL Media Pvt Ltd.