Reading Time: 2 minutes
Telangana: తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్.. ఎక్కడంటే..?

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఎయిర్‌స్ట్రిప్ ఉండగా.. ఇప్పుడు అది ఉపయోగంలో లేదు. దానిని అనుకుని ఉన్న స్థలంతో పాటు మరికొంత స్థలాన్ని సేకరించి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేశాయి. ఇప్పటికే దీని కోసం 2069 ఎకరాలను సేకరించాలని నిర్ణయించగా.. తొలి విడతలో 160.32 ఎకరాల సమీకరణకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే భూసేకరణను అధికారులు చేపట్టనున్నారు.

ఎయిర్‌పోర్టులపై వేగం పెంచిన సర్కార్

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై రేవంత్ సర్కార్ వేగం పెంచింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రెడీ అయింది. ఇప్పటికే భూమిని సేకరించగా.. త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ఇక రామగుండం, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులకు కూడా ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణకు సిద్దమైంది. అర్లి-బి పరిధిలో 58 మంది రైతుల భూములు ఉండగా.. కచ్ కంటి, టాక్లి ఏరియాల్లో భూమి కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. 60 రోజుల్లో అభ్యంతరాలు ఉంటే రైతులు తెలపాలని కోరింది. కచ్ కంటి ఏరియాలో 29.19 ఎకరాలను సేకరించనుండగా.. టాక్లి గ్రామంలో 5.20 ఎకరాలను సేకరించనుంది. ఈ మేరకు ఆర్డీఓ జగదీశ్వర్ రావు నోటిఫికేషన్ జారీ చేశారు. రైతులకు అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లోగా రాతపూర్వకంగా తెలపాలని సూచించింది. త్వరలోనే అధికారులు గ్రామసభలు నిర్వహించి పరిహారం విషయంలో అభిప్రాయ సేకరణ చేయనున్నారు. భూసేకరణ పూర్తయిన తర్వాత పనులను ప్రారంభించనున్నారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై ఆసక్తి

అయితే ఆదిలాబాద్ పట్టణం నుంచి అనుకుంట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని కచ్ కంటి గుండా మళ్లిస్తారని తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి బెంగళూరు నుంచి వచ్చిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ విభాగ బృందం ఏరియల్ సర్వే చేపట్టింది. దీంతో పాటు ఇప్పుడు భూసేకరణ ప్రక్రియ కూడా చేపట్టింది. దీంతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తయితే ఆదిలాబాద్ అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుంది. ఇక వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులను త్వరలో ప్రారంభించనుండగా.. ప్రధాని మోదీని శంకుస్థాపనకు ఆహ్వానిస్తారని తెలుస్తోంది. వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే ఉండటం వల్ల దూర ప్రాంతాల ప్రజలు ఇక్కడికి రావాలంటే చాలా సమయం పడుతుంది.