
కరీంనగర్: జమ్మికుంట పట్టణంలో నిశ్చితార్థం పూర్తయి పెళ్లి పెట్టుకున్న తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించాడు. జమ్మికుంటకు చెందిన కావ్య అనే యువతితో.. అఖిల్ అనే యువకునికి గత ఆదివారం (ఈనెల 16న) వివాహం జరగాల్సి ఉండగా వరుడు నిరాకరించడంతో పెళ్లి రద్దయింది. లగ్న పత్రికలు కొట్టించి బంధువులందరికీ పంచిన తర్వాత తనకు వివాహం ఇష్టం లేదని వరుడు అఖిల్ చెప్పడం వధువును, ఆమె కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. వరుడి నిర్ణయంపై జమ్మికుంటలో పెద్దల ముందు పంచాయతీ జరిగింది.
పెళ్లి రద్దు చేసుకున్నందుకు గాను వధువు కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు వరుని తరపు బంధువులు ఆఫర్ ఇచ్చారు. “మీరు ఇచ్చే డబ్బులు మాకు అవసరం లేదు క్షమాపణ చెప్పాలి” అని వధువు బంధువులు కోరారు. వందలాది మంది పంచాయతీ పెద్దల మధ్య వరుడు, అతని తల్లిదండ్రులు క్షమాపణ కోరారు. అయితే.. వధువు కాళ్లు మొక్కాలని పంచాయతీ పెద్దలు డిమాండ్ చేశారు. అందుకు వరుడు, అతని కుటుంబం ఒప్పుకోలేదు.
దీంతో.. ఇరు కుటుంబాల బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఉసురు తగిలి మట్టిగొట్టుకుని పోతారని అమ్మాయి తల్లి అబ్బాయికి, అతని కుటుంబానికి శాపనార్థాలు పెట్టింది. ఈ విషయం స్థానికంగా జమ్మికుంటలో హాట్ టాపిక్ అయింది. నిశ్చితార్థం, లగ్న పత్రికలు పంచాక పెళ్లి ఎందుకు వద్దనే విషయంలో కారణాలు తెలియాల్సి ఉంది.