Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Show You Can Bat 300 Balls Says Childhood Coach

Vaibhav Sooryavanshi Test Debut: టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన బుడ్డోడు.. ఇప్పుడు రెడ్‌బాల్‌ క్రికెట్‌లో తన సత్తా చాటేందుకు బరిలోకి దిగాడు. దులీప్‌ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఈస్ట్‌ జోన్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్‌.. త్వరలోనే టెస్టు జట్టులోకి వస్తాడా? అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ మొదలైంది. అయితే టెస్టు క్రికెట్‌లోకి రావాలంటే వైభవ్‌ మరింత సమయం తీసుకోవాల్సి ఉంటుందని బుడ్డోడి చిన్ననాటి కోచ్‌ మనీష్‌ ఓజా అభిప్రాయపడ్డారు.

ఇటీవల మనీష్‌ ఓజా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘వైభవ్‌ సూర్యవంశీ మొదటి నుంచే రెడ్‌బాల్‌తోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌ అతడి ప్రయాణంలో చాలా తర్వాత వచ్చింది. అందువల్ల రెడ్‌బాల్‌ క్రికెట్‌కు అతడు అలవాటు పడలేడనే ఆందోళన అవసరం లేదు. అయితే వైభవ్‌ ఎంత త్వరగా తన ఆటతీరును మార్చుకుంటాడన్నది కీలకం. వైట్‌బాల్‌ క్రికెట్‌లో ప్రతి బంతిని దూకుడుగా ఆడుతారు. కానీ టెస్టు క్రికెట్‌లో కొత్త బంతిని ఎదుర్కొంటూ ఓపికగా ఆడటం, సరైన బంతి కోసం వేచి చూడటం, రిస్క్‌ను తగ్గించుకోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది’ అని అన్నారు.

రెడ్‌బాల్‌ క్రికెట్‌లో వైభవ్‌ తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఓజా అన్నారు. కేవలం బౌండరీలు కొట్టడం కాకుండా.. పరిస్థితికి తగ్గట్టుగా వేర్వేరు పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాలి. సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ‘ఇన్నింగ్స్‌ను నిర్మించడం నేర్చుకోవాలి. వేర్వేరు గేర్లలో బ్యాటింగ్ చేయాలి. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో ఈ అనుభవం అతడికి ఇప్పుడు ఎంతో అవసరం’ అని ఓజా అభిప్రాయపడ్డారు. 2026 ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున వైభవ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు ఎంవీపీ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి మరో ఘనతను అందుకున్నాడు.

ఇప్పుడు దులీప్‌ ట్రోఫీలో రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం అతడికి దక్కింది. ఈ టోర్నీ ద్వారా టెస్టు క్రికెట్‌కు అవసరమైన సహనం, సాంకేతికత, ఇన్నింగ్స్‌ నిర్మాణంపై మరింత అవగాహన పెంచుకోవచ్చని కోచ్‌ భావిస్తున్నారు. వైభవ్‌ ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఉన్నాడని.. ఇంత చిన్న వయసులోనే టెస్టు జట్టులోకి రావాలని తొందరపడాల్సిన అవసరం లేదని మనీష్‌ ఓజా స్పష్టం చేశారు. దేశవాళీ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అతడికి ఇంకా అనుభవం అవసరమని అన్నారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వైభవ్‌ ఇప్పటివరకు పెద్దగా ఆడలేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో 207 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అండర్‌-19 యూత్‌ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలు సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం. దేశవాళీ క్రికెట్‌లో దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీ వంటి టోర్నీల్లో ఒక్క సీజన్‌కు పరిమిత సంఖ్యలోనే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుందని ఓజా వివరించారు. ఆ అవకాశాల్లో వరుసగా సెంచరీలు, డబుల్‌ సెంచరీలు సాధిస్తూ.. కనీసం రెండు, మూడు సంవత్సరాలు నిలకడగా రాణిస్తేనే టెస్టు జట్టులో స్థానం కోసం బలమైన పోటీదారుగా మారతాడని తెలిపారు.