
ఒక స్త్రీకి తల్లితనం ఒక అందమైన అనుభవం కావచ్చు కానీ ఆమె విలువకు అది కొలత కాకూడదు. ఏడేళ్ల పెళ్లి తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే ఆమెను చూసే చూపులు మారిపోయాయి. ఇంకా పిల్లలు లేరా? ఏమైనా సమస్య ఉందా? డాక్టర్‌కి చూపించుకున్నారా? ఎప్పుడు శుభవార్త చెబుతారు? ఆ ప్రశ్నలు అడిగినవాళ్లు ఆ మాటల బరువును మర్చిపోయి వెళ్లిపోయారు.
ఆమె మాత్రం ఆ మాటలతోనే ఇంటికి తిరిగి వచ్చేది. ఒక్కో ప్రశ్న ఆమె గుండెల్లో ఒక చిన్న గాయం చేసేది. పిల్లలు పుట్టకపోవడం ఆమె జీవితంలోని ఒక వ్యక్తిగత విషయం కానీ సమాజం దాన్ని అందరి చర్చగా మార్చేసింది. చివరికి బయటివాళ్లు అడిగిన ప్రశ్నలే ఒకరోజు ఆమె తనను తాను అడగడం మొదలుపెట్టింది. నా శరీరంలో ఏదైనా లోపం ఉందా? నేను తల్లిని కాలేనేమోనా?
అయితే ఏడేళ్ల ఎదురుచూపు తర్వాత ఒకరోజు పరీక్షలో రెండు గీతలు కనిపించాయి. ఆమె చేతులు వణికాయి. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ఇంట్లో ఆ రోజు వచ్చిన ఆనందం ఎన్నో ఏళ్ల బాధను కాసేపు కప్పేసింది. ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఇష్టమైనవి తెచ్చారు. బహుమతులు ఇచ్చారు. ఇంకా పుట్టని బిడ్డ కోసం అప్పుడే ఒక భవిష్యత్తు ఊహించుకున్నారు. ఎవరి పోలిక వస్తుంది? పేరు పెడతాం? ఇంకా ఆ బిడ్డ ఈ ప్రపంచంలోకి రాలేదు కానీ ఆ ఇంటి కలల్లో మాత్రం అప్పటికే జీవిస్తోంది.
ఆమె కడుపులో పెరుగుతున్న ఆ చిన్న ప్రాణంతో పాటు ఎన్నో ఆశలు కూడా పెరుగుతున్నాయి. పది వారాల దగ్గర జరిగిన పరీక్ష ఆ ఆశల మధ్యలో ఒక చీకటిని తీసుకొచ్చింది. అల్ట్రాసౌండ్‌లో గర్భం కనిపించింది కానీ శిశువు ఎదుగుదల ఆగిపోయింది. గుండె స్పందన కనిపించలేదు. వైద్యుడు చెప్పిన మాట ఆమెకు వినిపించింది. గర్భం ఇక కొనసాగదు. ఆమె మాత్రం ఆ నిజాన్ని వెంటనే తనలోకి తీసుకోలేకపోయింది. ఏడేళ్లు ఎదురు చూసిన తర్వాత వచ్చిన బిడ్డను కొన్ని నిమిషాల్లో ఎలా వదులుకోవాలి? ఆమెకు అది ఒక వైద్య నిర్ణయం మాత్రమే అనిపించలేదు. తన జీవితంలో ఎన్నేళ్లుగా ఎదురుచూసిన ఒక కలను వదిలేయమన్నట్టుగా అనిపించింది. ఏదైనా మారొచ్చు. ఏదైనా అద్భుతం జరగొచ్చు. అనే చివరి ఆశను పట్టుకుని ఉంది.
ఒక వారం గడిచింది. రాత్రి రెండు గంటలు.. తీవ్రమైన కడుపునొప్పితో ఆమె నిద్రలేచింది. మొదట ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్దిసేపటికే రక్తస్రావం మొదలైంది. బాత్రూమ్‌కి వెళ్లేసరికి రక్తం మరింత ఎక్కువైంది. రక్తపు గడ్డలు బయటకు వస్తున్నాయి. కడుపు లోపల నుంచి మెలికలు తిరిగినట్టుగా నొప్పి. భయం. ఏం జరుగుతుందో తెలియని గందరగోళం. తనలో ఇంతకాలం పెరిగిన జీవితం తన శరీరం నుంచి జారిపోతున్నదనే అనుభూతి. ఒక గంటకు పైగా ఆ బాధ కొనసాగింది. ఆమె ఏడ్చింది. ఏడుస్తూనే ఉంది. చివరికి కన్నీళ్లు కూడా ఆగిపోయాయి. శరీరం అలసిపోయింది. మనసు మొద్దుబారిపోయింది.
ఆ క్షణంలో ఒక తల్లి తన బిడ్డను కోల్పోవడం మాత్రమే జరగలేదు. ఏడేళ్ల తర్వాత ఊహించుకున్న ఒక భవిష్యత్తు కూడా ఆమె చేతుల నుంచి జారిపోయింది. వైద్యులు శరీరానికి అవసరమైన చికిత్స అందించారు. రక్తస్రావాన్ని నియంత్రించారు. శరీరం మెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. కానీ ఆ రాత్రి మనసులో మిగిలిన గాయం గురించి ఎవరూ అడగలేదు. రక్తస్రావం తగ్గిందా అని చూశారు కానీ.. ఆమెకు బాధ గురించి అడిగినవాళ్లు మాత్రం చాలా తక్కువ. ఇదే గర్భస్రావం తర్వాత కనిపించని బాధ. బయటికి కనిపించేది రక్తం.
లోపల మిగిలేది శోకం. బయటికి కనిపించేది శరీరం కోలుకోవడం. లోపల మాత్రం ఒక తల్లి ఇంకా ఆ రాత్రిలోనే ఉండిపోవచ్చు. అమెరికన్ వైద్య నిపుణుల సంస్థ ప్రకారం మొదటి 13 వారాల్లో జరిగే గర్భ నష్టం చాలా సాధారణం. ప్రారంభ గర్భస్రావాల్లో దాదాపు సగం సందర్భాల్లో గర్భంలోని శిశువు క్రోమోజోమ్‌లలో ఏర్పడే సమస్యలు కారణమవుతాయి. సాధారణంగా పని చేయడం, వ్యాయామం, ఒత్తిడి, గొడవలు లేదా శారీరక సంబంధం గర్భస్రావానికి కారణాలు కావు. అయినా ఆ సమయంలో చాలామంది మహిళల మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. నా వల్ల జరిగిందా? నేను ఏదైనా తప్పు చేశానా? ఆ రోజు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందా? కారణం తెలియని చోట మనసు తననే నిందించుకోవడం మొదలుపెడుతుంది.
అందుకే గర్భస్రావం తర్వాత ఒక వైద్యుడు చెప్పాల్సిన ముఖ్యమైన మాటల్లో ఒకటి… ఇది మీ తప్పు కాదు. ఆ మాట చిన్నదిగా అనిపించవచ్చు కానీ తనను తాను నిందించుకుంటున్న ఒక మహిళకు అది చాలా పెద్ద ఉపశమనం. ఎందుకంటే గర్భస్రావం తర్వాత శరీరం మాత్రమే మారదు. భవిష్యత్తు గురించి ఉన్న ఊహ కూడా మారిపోతుంది. మళ్లీ గర్భం వస్తుందనే ఆనందం స్థానంలో భయం రావచ్చు. మళ్లీ అదే జరిగితే? అనే ఆలోచన వెంటాడవచ్చు.
ఇంకొకరి గర్భం గురించి విన్నప్పుడు సంతోషంతో పాటు లోపల ఒక నొప్పి పుట్టొచ్చు. పసిపాప ఏడుపు వినిపించినప్పుడు కళ్లలో నీళ్లు తిరగొచ్చు. కొన్ని జ్ఞాపకాలు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. కొంతమందికి నిద్ర పట్టకపోవచ్చు. కొంతమందికి ఏ పని మీద ఆసక్తి ఉండకపోవచ్చు. మరికొందరు బయటికి చాలా సాధారణంగా కనిపిస్తూ లోపల మాత్రం పూర్తిగా ఖాళీగా ఉండొచ్చు. గర్భనష్టం తర్వాత భావోద్వేగంగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
దుఃఖం, ఆందోళన, నిరాశ, నిద్ర సమస్యలు, ఎమోషన్స్ మొద్దుబారడం, భయంకరమైన జ్ఞాపకాలు, పీడకలలు లాంటి అనుభవాలు కొంతమందిలో కనిపించవచ్చు. 2025లో ప్రచురితమైన ఓ మెడికల్ జర్నల్ ప్రకారం.. 29 అధ్యయనాలకు చెందిన 35వేల మందికి పైగా మహిళల సమాచారాన్ని పరిశీలించారు. గర్భస్రావం తర్వాత మొదటి ఆరు వారాల్లో దాదాపు 32 శాతం మందిలో ఆందోళన, 30 శాతం మందిలో నిరాశ, 33 శాతం మందిలో తీవ్రమైన ఒత్తిడి లక్షణాలు కనిపించాయి. అంటే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన రోజుతో చికిత్స పూర్తయిందని భావించలేం. శరీరానికి చికిత్స పూర్తవుతుంది. మనసుకు ఇంకా సమయం కావచ్చు.
అక్కడ కుటుంబం పాత్ర చాలా పెద్దది. మళ్లీ పిల్లలు పుడతారు అని చెప్పడం సులభం. ఇది చాలా మందికి జరుగుతుందని చెప్పడం కూడా సులభం. మర్చిపో అని చెప్పడం ఇంకా సులభం. కానీ దుఃఖాన్ని మర్చిపోమని చెప్పడం ద్వారా దుఃఖం మాయమవదు. ఒక బిడ్డను కోల్పోయిన బాధను ఇంకో బిడ్డ రాక భర్తీ చేయదు. కొత్త బిడ్డ భవిష్యత్తును తీసుకొస్తుంది. పోయిన బిడ్డ మాత్రం ఒక జ్ఞాపకంగా మిగులుతుంది. రెండింటికీ ఒకే గుండెలో చోటు ఉంటుంది.
భార్యాభర్తల మధ్య కూడా ఈ దుఃఖం ఒకేలా కనిపించకపోవచ్చు. ఒకరికి మాట్లాడాలని అనిపించవచ్చు. మరొకరికి మౌనంగా ఉండాలని అనిపించవచ్చు. ఒకరికి మళ్లీ బిడ్డ కోసం ప్రయత్నించాలని అనిపించవచ్చు. మరొకరికి మళ్లీ గర్భం అనే ఆలోచనే భయంగా అనిపించవచ్చు. ఇద్దరూ ఒకే నష్టాన్ని ఎదుర్కొన్నా, దాన్ని మోసే విధానం వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే ఒకరి కన్నీళ్లు కనిపించకపోతే ఆ బాధ తక్కువైందని అర్థం కాదు. కొంతమంది బాధను మాటల్లో పెడతారు. కొంతమంది పనిలో దాచేస్తారు. కొంతమంది రాత్రిళ్లు ఒంటరిగా ఏడుస్తారు.
మరికొందరు ఏడవలేకపోవడమే తమ బాధగా మారుతుంది. మానసిక ఆరోగ్య నిపుణులు గర్భస్రావాన్ని ఒక వైద్య సంఘటనగా మాత్రమే చూడకుండా, ఒకప్పుడు ఎంతో ఆశతో ఊహించుకున్న భవిష్యత్తును కోల్పోయిన అనుభవంగా కూడా చూడాలని చెబుతున్నారు. అందుకే ఆ నష్టానికి మాట్లాడే అవకాశం ఉండాలి. అవసరమైతే కౌన్సెలింగ్ ఉండాలి. బాధ ఎక్కువకాలం కొనసాగితే మానసిక వైద్య సహాయం కూడా అందాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన గర్భధారణల్లో దాదాపు పది 10నుంచి 15 శాతం వరకు గర్భస్రావంతో ముగుస్తాయి. ఇంత సాధారణంగా జరుగుతున్న నష్టానికి చుట్టూ ఇంకా సిగ్గు, మౌనం, సామాజిక ఒత్తిడి ఉండటం వల్ల చాలా మంది మహిళలు తమ బాధను లోపలే, ఒంటరిగా మోస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం.