Reading Time: 2 minutes
Jhansi: టెక్‌ జాబ్‌ వదిలి ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి.. పాటలతో పంటకు ప్రాణం పోస్తున్న రైతు బిడ్డ!

చేస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే చేయాలి.. బ్రతికితే సిటీలోనే బ్రతకాలి అనే మైండ్ సెట్ కలిగిన యువత ఉన్న ఈ రోజుల్లో ఓ యువతి మాత్రం వారికి బిన్నంగా ఆలోచించింది. అందరిలా తాను సిటీ లైఫ్ కోరుకుంటే.. మరి వ్యవసాయం ఎవరు చేస్తారని అనుకుంది.. అదే సంకల్పంతో పొలంలోకి దిగి వ్యవసాయం గురించి నలుగురికి తెలిసేలా చేస్తోంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె సూర్యాపేట మండలం కోమటికుంటకు చెందిన ఝాన్సీ.. గుండెబోయిన హేమలత, సైదులు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు ఝాన్సీ మాత్రం తండ్రి వ్యవసాయ కష్టాలను చూసి బాధపడేది. 9వ తరగతి నుండి ఝాన్సీ.. వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంది.

అయితే, ఇంటర్ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసిన ఝాన్సీ.. నగరాల్లో ఉద్యోగం కోసం వెతకడం మానేసి వ్యవసాయాన్ని ఎంచుకుంది. పొలంలో దుక్కి దున్నడం నుంచి వరాలు తీయడం వరకు.. పంటకు అవసరమైన పనుల్లో స్వయంగా తండ్రితో పాటు భాగస్వామి అయింది. పురుగు మందుల పిచికారీ, ఎరువులు చల్లడం వంటి పనుల్లో ఆరుగాలం రైతు పడే కష్టం మరింతగా అర్థం చేసుకుంది. మొదట్లో వ్యవసాయం అంటే పంట పండించడం మాత్రమే అనుకుంది. కానీ పొలంలోకి అడుగుపెట్టాక అసలు కథ అర్థమైంది. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతు పడే ప్రతి కష్టం వెనుక ఓ పెద్ద పోరాటమే ఉందని తెలుసుకుంది

సింగర్ ఝాన్సీగా..

జానపదాలు పాడే తాత నుండి కూని రాగాలు తీయడం నేర్చుకున్న ఝాన్సీ.. విద్యార్థినిగా ఉన్నప్పుడే పలు వేదికల్లో ఫోక్, సినీ పాటలు పాడి పాడింది. వ్యవసాయంలో రైతుల కష్టాన్ని స్వయంగా చూసిన ఝాన్సీ.. ఆ కష్టాన్ని పాటల రూపంలోకి మలిచి పాడటం మొదలు పెట్టింది. ఓ రోజు ఝాన్సీ ట్రాక్టర్ నడుపుతూ పాట పడుతుండగా తమ్ముడు అరుణ్ వీడియోల రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోకు మంచి స్పందన వచ్చింది.

రైతు కష్టం.. పాటగా మారింది..

రైతుల కష్టం.. పొలాల్లో వారి జీవితం.. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను వీడియోల రూపంలో చూపించడం మొదలు పెట్టింది. పాటలంటే ఇష్టం ఉండటంతో.. రైతు జీవితాన్ని పాటలుగా మలిచి ప్రజల్లోకి తీసుకెళ్లింది. పొలంలో బురద అంటుకున్నా.. ఎండ మండుతున్నా.. పని ఆగదు. రైతుకు సెలవు ఉండదు. ప్రకృతి సహకరించక పోయినా.. పంట కోసం పోరాటం ఆపలేడు. ఆ కష్టాన్ని దగ్గరగా చూసిన ఆమెకు రైతు జీవితం విలువ తెలిసింది. దీంతో ‘బురదా నుంచి బువ్వను తీస్తే కమ్మగుందని తిన్నరు.. బురదా దుస్తుల రైతును చూస్తే దూరంగా ఉండని అన్నరు’ పాట గుర్తింపు తెచ్చింది.

సోషల్ మీడియా.. రైతు జీవితానికి వేదిక..

పంట పండించే రైతు వెనుక ఉన్న శ్రమను సమాజానికి పరిచయం చేస్తూ వ్యవసాయ క్షేత్రంలో చేసే ప్రతి పనిని వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది. దీంతో ఆమె వీడియోలకు మంచి స్పందన వచ్చింది. వ్యవసాయాన్ని వదిలి పట్టణాల వైపు పరుగులు తీస్తున్న యువతకు.. పొలం కూడా ఓ కెరీర్ కావచ్చని, రైతుగా ఉండటం కూడా గర్వకారణమేనని తన ప్రయాణంతో చెబుతోంది.

కష్టానికి  తగ్గ గుర్తింపు

వ్యవసాయంపై ఆమెకున్న ఆసక్తి.. రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా గుర్తింపు తెచ్చాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వచ్చాయి. తన ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం పెరిగింది. ఒకప్పుడు పొలం అంటే కేవలం పంట పండించే స్థలం. ఇప్పుడు ఆమెకు అదే కంటెంట్ క్రియేషన్‌కు వేదిక.. రైతు గొంతుకకు మాధ్యమం.. యువతకు స్ఫూర్తిగా మారింది.

పోలీస్ అవ్వాలనే కోరిక

పోలీసు కావాలనే లక్ష్యం కోసమూ చదువుతున్నానని ఝాన్సీ చెబుతోంది. సాగు నేర్పిన పాఠంతో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తట్టుకుని నిలబడి.. టార్గెట్ ను సాధిస్తానని ఝాన్సీ చెబుతోంది. చేతిలో పెన్ను పట్టుకుని రైతు గురించి రాయడం ఒక ఎత్తయితే.. అదే రైతు కష్టాన్ని స్వయంగా అనుభవించి ప్రపంచానికి చూపించడం మరో ఎత్తు. టెక్ ఉద్యోగాల కోసం నగరాల వైపు పరుగులు తీస్తున్న తరానికి.. ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని ఝాన్సీ చెబుతున్న మెసేజ్ ఒక్కటే. “పొలం చిన్నది కాదు.. రైతు పని తక్కువ కాదు.. అన్నం పెట్టే చేతికి మించిన గౌరవం మరొకటి లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.