Reading Time: < 1 minute

హైదరాబాద్ను కమ్మేసిన వాన ముసురు.. ఈ ఏరియాల్లో పొట్టుపొట్టు కొడుతున్న వర్షం

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ సిటీని వాన ముసురు కమ్మేసింది. మధ్యాహ్నం నుంచి సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. రాజేంద్రనగర్, శంషాబాద్, మైలర్ దేవ్ పల్లి, అత్తాపూర్. కిస్మత్పూర్, బండ్లగూడ, హైదర్ షా కోర్ట్, నార్సింగి మణికొండ, పుప్పాల గూడ, కోకాపేట్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అంబర్ పేట్, విద్యా నగర్, కోరంటి, నారాయణ గూడ, రామంతాపూర్లో వర్షం కురిసింది.

సికింద్రాబాద్, బోయిన్ పల్లి, డైమండ్ పాయింట్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, బేగంపేట్, రాంగోపాల్ పేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం నుంచి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం ఒక్కరోజు మాత్రం భారీ  నుంచి అతి భారీ, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం అతి భారీ వర్షాలతో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఆదివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఆదివారం మరో 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశంతో IMD ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలో కురిసే అవకాశంతో  హెచ్చరికలు జారీ చేసింది.

మిగిలిన అన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో కూడా తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

©️ VIL Media Pvt Ltd.