
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సెప్టెంబర్ 3న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా డెఫినిట్‌గా హిట్ అవుతుంది. సక్సెస్‌పై నమ్మకంగా ఉన్నాం’ అని అన్నారు. హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘భద్రకాళీ పిక్చర్స్ అంటే అందరికీ డ్రీమ్ బ్యానర్.
ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీ. డైరెక్టర్ వేణుగోపాల్ నాతో ఆరు నెలలు రిహార్సల్స్ చేయించారు. కథ విన్నప్పుడే చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఇందులోని ప్రతి క్యారెక్టర్‌ను ఆడియెన్స్ గుర్తుపెట్టుకుంటారు’ అని చెప్పాడు. హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ మాట్లాడుతూ ‘ఇదొక బ్యూటిఫుల్ స్క్రిప్ట్. నేను వివిధ తరహా చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నా. అలా నేను కోరుకున్న జానర్స్‌లో ఇది కూడా ఉంది’ అని చెప్పింది. ఈ చిత్రం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి, నిర్మాత ప్రణయ్ రెడ్డి అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.