Reading Time: < 1 minute
Saransh Jain India Test Debut Without Ipl Rare Record Created

Saransh Jain India Debut: శ్రీలంకతో కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 33 ఏళ్ల సారంశ్ జైన్ టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో.. అతడి స్థానంలో సారంశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. జాతీయ జట్టులోకి ఎంపిక కావడంతోనే సారంశ్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

21వ శతాబ్దంలో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అత్యధిక వయస్కుడిగా సారంశ్ జైన్ నిలిచాడు. సారంశ్ ప్రస్తుత వయసు 33 ఏళ్ల 145 రోజులు. ఇంతకుముందు ఈ రికార్డు సబా కరీం పేరిట ఉంది. 2000లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో సబా కరీం 32 ఏళ్ల 362 రోజుల వయసులో భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పుడు సారంశ్ జైన్ 33 ఏళ్ల 145 రోజుల వయసులో అరంగేట్రం చేయడంతో ఆ రికార్డును అధిగమించాడు.

సారంశ్ జైన్ అరంగేట్రంతో మరో ప్రత్యేక ఘనతను కూడా అందుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే భారత జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు మురళీ విజయ్, మహ్మద్ షమీ ఈ అరుదైన ఫీట్‌ను సాధించారు. విజయ్ 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టులో అరంగేట్రం చేయగా.. షమీ 2013లో ఢిల్లీలో పాకిస్థాన్‌పై వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

సారంశ్ జైన్ చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు చేసిన అతడు.. ఎన్నో ఏళ్ల పాటు జాతీయ జట్టు పిలుపు కోసం ఎదురుచూశాడు. ఇప్పుడు 33 ఏళ్ల వయసులో ఆ కల నెరవేరింది. టెస్ట్ సిరీస్ ముందు లంక-ఏ జట్టుపై సారాంశ్ ఆకట్టుకున్నాడు. రెండో టెస్టులో 6 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 70 పరుగులు చేసి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామ సమయానికి 25 ఓవర్లలో 88/2 స్కోరుతో ఉంది.