Reading Time: < 1 minute
1984 Anti Sikh Riots Victims Families Demand Rahul Gandhi Apology Over Sajjan Kumar Remarks

1984 Anti-Sikh Riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధిత కుటుంబాలు కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసం ముందు నిరసన చేపట్టారు. మాజీ కాంగ్రెస్ నేత, సిక్కుల ఊచకోత ఘటనలో దోషిగా ఉన్న సజ్జన్ కుమార్‌ను కొందరు కాంగ్రెస్ నాయకులు ‘‘హీరో’’, ‘‘రోల్ మోడల్’’ అని కీర్తించడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ గురువారం మరణించిన నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి. రాహుల్ గాంధీ నివాసమైన 5, సునెహ్రీ భాగ్ రోడ్ వద్ద ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, ప్రధాన కార్యదర్శి జగ్‌దీప్ సింగ్ కహ్లోన్ నేతృత్వంలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సజ్జన్ కుమార్‌ను కాంగ్రెస్ హీరోగా పరిగణిస్తుందా.? అనే దానిపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. సిక్కు నాయకులు రాహుల్ గాంధీ సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘42 ఏళ్ల తర్వాత మా కుటుంబాల గాయాలను మరోసారి కదిలించారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు దీనిని అంగీకరించి క్షమాపణలు చెప్పాలి’’ అని సిక్కు నాయకులు డిమాండ్ చేశారు. నిరసనకారులు శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.