Reading Time: 2 minutes
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్.. ఏమన్నారంటే?

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ యువతిని కారు ఢీకొట్టడంతో అమె ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ఆ సమయంలో కారు నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంపై తాజాగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ స్పందించారు. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందడం తీవ్ర విషాదకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు సంజుష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి, తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించాడని ఎంపీ తెలిపారు. అనంతరం పోలీసులకు స్వయంగా ప్రమాదం గురించి సమాచారం అందించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వారికి వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజుష్‌కు మూడు వేర్వేరు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షలన్నింటిలోనూ ఫలితాలు నెగెటివ్‌గా వచ్చినట్లు ఎంపీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారులకు తన కుమారుడు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాడని తెలిపారు.

ఈ కేసులో తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదని, చట్టపరమైన ప్రక్రియల నుంచి తప్పించుకునే ఉద్దేశం గానీ ప్రయత్నం గానీ తమకు లేదని ఎంపీ లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. పోలీసుల నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రమాదం ఎప్పుడు ఎలా జరిగింది?

ఆగస్ట్ 16 మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 26 ఏళ్ల భారతి ముఖి ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. అయితే భారతి తన ఫ్రెండ్‌తో కలిసి లంచ్ తెచ్చుకుని రోడ్డు దాటే క్రమంలో అటుగా వేగంగా వచ్చిన ఓ లగ్జరీ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ ఫిర్యాదుతో ఘటనపై విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు ప్రమాద సమయంలో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ ఆ కారు నడుపుతున్నట్లు గుర్తించారు.దీంతో ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమవ్వడం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.