Reading Time: 2 minutes
డిగ్రీ గ్రాడ్యుయేట్లకు 2,482 బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.85,920 జీతం

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నుంచి మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్యాంకు బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,482 బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్ట్ 1, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్ఠంగా 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 7, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్‌ఎం/ మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్‌, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (GD)/ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పే లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

ఆన్‌లైన్ రాత పరీక్ష విధానం

ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 120 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు 120 మార్కులకు ఉంటుంది. పరీక్షకు 120 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, జనరల్/ఎకానామిక్ అవేర్‌నెస్ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, రీజనింగ్ & క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.