
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లి గొంతు కోసి ఆపై కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ (32) గురువారం కూరగాయలు కోసే కత్తితో ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లి దుర్గమ్మ గొంతు కోశాడు. అనంతరం ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటికి వచ్చిన తండ్రి నర్సయ్య తలుపులు కొట్టగా ఎంతసేపటికి స్పందన లేదు. దీంతో చుట్టుపక్కల వారి సహయంతో తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో భార్య, ఉరివేసుకున్న కుమారుడు కనిపించాడు. తీవ్రంగా గాయపడిన దుర్గమ్మను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గొంతు లోతుగా తెగడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మానకొండూరు పోలీసులు, ఏసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా శ్రావణ్ కుమార్ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై మానకొండూరు పోలీసులు చేసి దర్యాప్తు చేపట్టారు.