Reading Time: 2 minutes
Pocharam Srinivas Reddy Silent After Revanth Reddy Meeting Telangana Politics

OTR: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి వరుసగా చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ను పొగిడారు. గులాబీ అధినేత హయాంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. అన్నం పెట్టిన వారిని మరువద్దని కూడా అన్నారు. ఆయన మాటలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. బీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం కాంగ్రెస్‌లో చేరారు. అయితే… ఆయన అనుకున్నది ఒక్కటైతే… మరోటి జరుగుతుండటంతో కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారట. నాలుగు నెలల్లో మూడు సార్లు ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్ళినపుడు మొదటిసారి ప్రభుత్వంపై కస్సుబుస్సుమన్నారు. మంత్రులు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మండిపడ్డారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి అలర్టై శ్రీనివాస్‌ రెడ్డిని శాంతింపచేశారట. అది జరిగిన రెండు నెలలకే పోచారం మరోసారి భగ్గుమన్నారు. అభివృద్ధి నిధులు విడుదల చేయడం లేదని రుసరుసలాడారు. పోచారం కామెంట్స్ బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు అలెర్ట్ అయ్యారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి పోచారంతో చర్చలు జరిపారట.

ఇటీవల బిచ్కుందకు వచ్చిన సీఎంకు పోచారం స్వాగతం పలికారు. అదే సమయంలో ఆయనతో చర్చలు జరిపారనే టాక్ నడుస్తోంది. ఓపిక పట్టాలంటూ సీఎం కోరారట. గౌరవానికి భంగం కలిగించే పనులు చేయబోమంటూ అనుకూలమైన సంకేతాలు ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అనవసర వ్యాఖ్యలతో పార్టీకి, వ్యక్తిగతంగా మీకు నష్టం చేసుకోవద్దంటూ చెప్పారట సీఎం రేవంత్. సీఎంతో సమావేశం అయ్యాక.. పోచారం మనస్సు మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకనే ఆయన సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారట. మరోవైపు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వ్యతిరేకవర్గం ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. ఆయన్ని సస్పెండ్ చేయాలని పీసీసీకి ఫిర్యాదు కూడా చేసిందట. వ్యతిరేక వర్గం ఆందోళనను లైట్ తీసుకున్న పోచారం… దూకుడు తగ్గించి ఓపిక పట్టాలని డిసైడ్ అయ్యారట. గత ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్దికి నిధుల మంజూరుకు ప్రొసిడింగ్ మాత్రమే ఇచ్చారట. నిధుల మంజూరుకు ప్రత్యేకంగా జీఓలు జారీ చేయలేదట. అదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు శ్రీనివాస్‌ రెడ్డికి చెప్పారట. ఆ కారణంగా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని అర్థం అయ్యేలా వివరించారట. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దని సూచించారట. బీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వకుండా… ఓపిక పడితే మేం చూసుకుంటామని హామీ ఇచ్చారట హస్తం పార్టీ పెద్దలు. దీంతో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వెనక్కి తగ్గారని చర్చ జరుగుతోంది. మరోవైపు బాన్సువాడ రాజకీయం రసవత్తరంగా మారిందట. పోచారంను మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి నీడలా వెంటాడుతున్నారట. పార్టీకి నష్టం కలిగిచేలా మాట్లాడితే చాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీగా ఉన్నారట. దీంతో ఓపికగా వేచి చూడాలని నిర్ణయించుకున్నారట పోచారం. కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే పెద్దాయన మౌనంగా ఉంటారా..? మళ్లీ బుస కొడతారా అన్నది వేచి చూడాలి..!