Reading Time: 2 minutes

యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 సీజన్ 2: పోస్టర్ ఆవిష్కరించిన దిల్ రాజు.. ఫస్ట్ ప్రైజ్ రూ.3 లక్షలు!

Caption of Image.

తెలంగాణ సంస్కృతి, పండుగలు, చరిత్రను తమ కెమెరాతో ప్రపంచానికి చూపించాలనుకునే యువ ఫిల్మ్ మేకర్స్‌కు అదిరిపోయే అవకాశం . బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 – సీజన్ 2’ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. యువతలోని సృజనాత్మకతకు పదును పెట్టడంతో పాటు.. భవిష్యత్ సినీ ప్రయాణానికి ఓ మంచి ప్లాట్‌ఫామ్‌గా ఈ పోటీలు నిలవనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు,  ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, టీఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి ఆవిష్కరించారు.

యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 – సీజన్ 2…

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలను ఇతివృత్తాలుగా తీసుకుని షార్ట్ ఫిల్మ్స్, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు దిల్‌ రాజు తెలిపారు. ఈసారి పోటీలను మరింత విస్తృతం చేస్తూ కొత్తగా జానపద పాటలు, ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలు, వ్యాసాలు కు  కూడా ఈ ‘యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 – సీజన్ 2’ లో అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దిల్ రాజు కోరారు. 

యువతకు సినీ రంగంలో అవకాశాలు..

ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయని క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా  తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని అన్నారు.

రూ.3 లక్షల బంపర్ ప్రైజ్..

ఈ పోటీల్లో విజేతలకు భారీ నగదు బహుమతులు అందించనున్నారు. ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.1 లక్షగా ప్రకటించారు. మరో ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున కన్సోలేషన్ ప్రైజ్ అందించనున్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు కూడా అందజేస్తారు.

డెడ్‌లైన్ ఎప్పుడంటే?

షార్ట్ ఫిల్మ్ నిడివి 3 నిమిషాలకు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. వీడియోలు 4K రిజల్యూషన్‌లో ఉండాలి. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.comకు లేదా 8125834009 వాట్సాప్ నంబర్‌కు పంపాలని  తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలిపింది.

నిపుణులతో కూడిన జ్యూరీ ఉత్తమ ప్రతిభను ఎంపిక చేయనుంది. యువతకు భవిష్యత్‌లో సినీ అవకాశాలకు మార్గం చూపడంతో పాటు తెలంగాణ గొప్పదనాన్ని కొత్త తరానికి, ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ఈ ఛాలెంజ్ నిలవనుంది. మీ కథ.. మీ కెమెరా.. మీ క్రియేటివిటీ.. చూపించి రూ.3 లక్షల బహుమతి అందుకోండి మరి.

 

©️ VIL Media Pvt Ltd.