Reading Time: 2 minutes
Google Ai Plus Free For Students In India 1 Year Free Offer Benefits And Eligibility

Google AI Plus Free: కృత్రిమ మేధస్సు (AI)ను చదువుల్లో బాగా ఉపయోగిస్తున్న కాలేజీ విద్యార్థులకు గూగుల్ (Google) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు Google AI Plus ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.399గా ఉన్న ఈ ప్లాన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తే విద్యార్థులకు దాదాపు రూ.4,700 వరకు ఆదా కానుంది.

ఈ ఆఫర్‌లో భాగంగా విద్యార్థులకు జెమినీ లోని అధునాతన ఫీచర్లకు యాక్సెస్‌తో పాటు సాధారణ యూజర్ల కంటే ఎక్కువ వినియోగ పరిమితులు, 400GB క్లౌడ్ స్టోరేజీ వంటి ప్రయోజనాలు లభించనున్నాయి. అయితే ఈ ఆఫర్‌ను పొందాలంటే విద్యార్థుల గుర్తింపు, కాలేజీకి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది.

విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జెమినీలో ప్రత్యేకంగా “స్టూడెంట్ హబ్”ను కూడా గూగుల్ అందిస్తోంది. ఇందులో ఫ్లాష్‌కార్డులు, ప్రాక్టీస్ క్విజ్‌లు, స్టడీ నోట్‌బుక్‌లు, ఇతర AI ఆధారిత విద్యా సాధనాలను ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులు తమ క్లాస్ నోట్స్, లెక్చర్ స్లైడ్స్, ఇతర స్టడీ మెటీరియల్‌ను అందించి వాటి ఆధారంగా వ్యక్తిగత స్టడీ ప్లాన్‌లను రూపొందించుకోవచ్చు. అంతేకాకుండా JEE, NEET వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రాక్టీస్ క్విజ్‌లు, లెర్నింగ్ టూల్స్‌ను కూడా గూగుల్ అందిస్తోంది. క్లిష్టమైన కాన్సెప్టులను ఇంటరాక్టివ్‌గా అర్థం చేసుకోవడానికి జెమినీ సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రశ్న లేదా స్టడీ మెటీరియల్ ఫొటోను అప్‌లోడ్ చేసి దాని గురించి స్టెప్ బై స్టెప్ వివరణ కూడా పొందవచ్చు.

విద్యార్థుల వద్ద ఉన్న నోట్స్, లెక్చర్ మెటీరియల్ లేదా ఇతర డాక్యుమెంట్లను జెమినీకి అందించి వాటి సారాంశాన్ని రూపొందించుకోవచ్చు. ఏ అంశాల్లో విద్యార్థికి ఎక్కువ అవగాహన అవసరమో గుర్తించడంలో AI సహాయపడుతుంది. దీనితో ఆ అంశాలపై దృష్టి పెట్టేలా చిన్నచిన్న స్టడీ ప్లాన్‌లు, క్విజ్‌లు రూపొందించుకోవచ్చు. అలాగే జెమినీ లైవ్ ను కూడా విద్యార్థుల చదువులకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు గూగుల్ కొత్త ఫీచర్లను అందిస్తోంది. విద్యార్థులు వాయిస్ ద్వారా AIతో సంభాషిస్తూ రీసెర్చ్, చదువులకు సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. డీప్ రీసెర్చ్ వంటి ఫీచర్ల ద్వారా ఒక అంశంపై లోతైన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఆ సమాచారంపై జెమినీతో మరింత చర్చించవచ్చు.

విద్యార్థుల కోసం గూగుల్ మరో ప్రయోజనాన్ని కూడా ప్రకటించింది. గూగుల్ AI ప్రో, యూట్యూబ్ ప్రీమియం కలిపిన బండిల్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ బండిల్ ద్వారా విద్యార్థులు సుమారు 70% వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ అందిస్తున్న ఈ ఉచిత ఆఫర్‌పై మరో కోణంలోనూ చర్చ జరుగుతోంది. విద్యార్థులు Geminiని విస్తృతంగా ఉపయోగించడం ద్వారా వారి వినియోగ విధానాలు, AIతో వారు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారనే అంశాలపై కంపెనీకి మరింత డేటా లభించే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ డేటా భవిష్యత్ AI ఉత్పత్తులు, మోడళ్లను మెరుగుపరచడంలో ఉపయోగపడే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. అయితే విద్యార్థులు ఆఫర్‌ను ఉపయోగించే ముందు డేటా, ప్రైవసీకి సంబంధించిన నిబంధనలను పరిశీలించడం మంచిది.

అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులు “గూగుల్ జెమినీ ఫర్ స్టూడెంట్స్” పేజీకి వెళ్లి తమ అర్హతను చెక్ చేసుకోవచ్చు. ఆఫర్‌ను పొందేందుకు విద్యార్థి గుర్తింపు, కాలేజీ వివరాల వెరిఫికేషన్ అవసరం కావచ్చు. భారత్‌లో అర్హత కలిగిన విద్యార్థులు ఈ ఆఫర్‌ను 2026 డిసెంబర్ 31లోపు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.