Reading Time: 2 minutes
న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ.. మద్దతు ప్రకటించిన ట్రంప్

అమెరికాలో భారత సంతతికి చెందిన పలువురు అత్యున్నత  పదవుల్లో ఉన్నారు. సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్‌ ఆంధ్రాకు చెందిన తెలుగు మహిళ కాగా జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్‌ మేయర్‌ పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా మరో తెలుగు తేజం అమెరికాలో మరో అత్యున్నత పదవి కోసం జరిగే ఎన్నికలలో పోటీ పడుతున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కోమటిరెడ్డి సరిత పోటీలో ఉన్నారు. అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌కు ప్రత్యర్థిగా సరిత ఎన్నికల బరిలో నిలిచారు. అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు బహిరంగంగా మద్దతు కూడా ప్రకటించారు. ఆగస్టు 15న ట్రంప్ తన ట్రూత్‌ సోషల్‌ వేదిక ద్వారా సరితను ఎండార్స్‌ చేస్తూ.. ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్‌ను విమర్శించారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో సరితకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.

సంచలనంగా ‘సరితా కోమటిరెడ్డి’ ప్రయాణం!

సరిత భారత సంతతికి చెందిన పేరున్న న్యాయవాది. ఆమె తల్లిదండ్రులు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినవారు. తండ్రి డాక్టర్‌ హనుమంత్‌రెడ్డి కార్డియాలజిస్ట్ గా .. తల్లి డాక్టర్‌ గీతా రెడ్డి రుమటాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. 1980లలో అమెరికాలో స్థిరపడ్డారు ఈ దంపతులు. బ్రూక్లిన్‌లో వారికి సరిత జన్మించింది. అయితే తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా సరిత మిస్సోరీలో పెరిగారు. 41 ఏళ్ల సరితకు నలుగురు పిల్లలు. హార్వర్డ్ కాలేజ్, హార్వర్డ్ లా స్కూల్‌లో చదివి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు సరిత. ఆ తర్వాత అమెరికా ఫెడరల్ న్యాయ వ్యవస్థలో ముఖ్య బాధ్యతలు చేపట్టారు. ముందుగా యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా జాబ్‌ చేసారు. అప్పటి జడ్జ్‌ బ్రెట్ కవనాగ్ వద్ద క్లర్క్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ఆ తర్వాత కొలంబియా లా స్కూల్‌లో లెక్చరర్‌గా వర్క్‌ చేసారు.

ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేసిన సరిత అల్‌ ఖైదా ఉగ్రవాదం, మెక్సికన్‌ డ్రగ్‌ కార్టెల్స్‌కు సంబంధించి మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు మొదలుకొని సైబర్ నేరాలు, మనీలాండరింగ్, మోసం, విదేశీ ప్రభుత్వ అవినీతి  కేసులను విచారించారు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ కి  చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా పనిచేసారు. ప్రస్తుతం అత్యంత ప్రతిష్ఠాత్మక హోల్జ్‌మన్ వోగెల్ సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందిన తొలి తెలుగు అభ్యర్థిగా సరిత గుర్తింపు పొందారు.