Reading Time: 2 minutes
అరెరె ఇంత ఈజీనా.. మొక్కజొన్న గింజలు ఒలవడం ఇక చిటికెలో పని.. సూపర్ ట్రిక్స్ ఇవే..

వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన లేదా ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే కార్న్ చాట్, సూప్, సలాడ్ లేదా శాండ్‌విచ్‌లు తయారు చేసుకోవడానికి పొత్తు నుంచి గింజలను వేరు చేయడం చాలామందికి పెద్ద సవాలుగా మారుతుంది. ఒక్కో గింజను చేత్తో వలవాలంటే చేతి వేళ్లు నొప్పి పుట్టడంతో పాటు ఎంతో సమయం వృథా అవుతుంది. అదే కత్తితో త్వరగా కోసేద్దామంటే సగం గింజలు కటింగ్ బోర్డు పైనా, మరికొన్ని కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా ఎగిరిపడి నేలపాలవుతూ చికాకు తెప్పిస్తాయి. అయితే ఇలాంటి చిరాకు లేకుండా, ఇంట్లో ఉండే సాధారణ పాత్రలను ఉపయోగించి చిటికెలో మొక్కజొన్న గింజలను ఎలా ఒలవాలో చాలా మందికి తెలియదు. చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే మీ పని చాలా ఈజీ అవుతుంది.

పెద్ద గిన్నె, చిన్న గిన్నె ట్రిక్

  • ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను తీసుకోండి.
  • దాని మధ్యలో ఒక చిన్న గిన్నెను బోర్లించి పెట్టండి.
  • ఇప్పుడు మొక్కజొన్న పొత్తును ఆ చిన్న గిన్నె అడుగు భాగంపై నిలువుగా పట్టుకోండి.
  • కత్తితో పైనుంచి కిందికి గింజలను కోయండి.
  • ఇలా చేయడం వల్ల గింజలు బయట పడకుండా నేరుగా పెద్ద గిన్నెలోనే పడతాయి.

బండ్ట్ పాన్ లేదా కేక్ మోల్డ్ టెక్నిక్

మధ్యలో రంధ్రం ఉండే కేక్ పాత్ర ఉంటే ఈ పని మరింత సులువవుతుంది. మొక్కజొన్న కొన భాగాన్ని ఆ రంధ్రంలో నిలబెట్టి నిలువుగా ఉంచండి. పైనుంచి కిందికి కత్తితో గింజలను కట్ చేయండి. గింజలన్నీ ఆ మోల్డ్ చుట్టూ ఉన్న గిన్నె భాగంలోనే సురక్షితంగా జమవుతాయి.

చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం

పొడవాటి మొక్కజొన్న పొత్తును పట్టుకోవడం కష్టంగా ఉంటే, దాన్ని రెండు లేదా మూడు ముక్కలుగా విరగ్గొట్టండి. చిన్న ముక్కలను స్థిరంగా పట్టుకోవడం సులభం. దీనివల్ల కత్తి వాడేటప్పుడు చేతిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా గింజలను వేగంగా కోయవచ్చు.

తేలికపాటి ఉడకబెట్టడం

కొన్ని వంటకాల్లో కార్న్‌ను ఉడికించి వాడుతుంటారు. అలాంటి సమయంలో పొత్తును కాసేపు వేడినీళ్లలో తేలికగా ఉడికించి, చల్లారాక గింజలను తీస్తే అవి చాలా సులభంగా ఊడివస్తాయి.
అయితే గింజలు మరీ మెత్తబడకుండా ఉండేందుకు ఎక్కువసేపు ఉడికించకుండా చూసుకోవాలి.

కత్తి ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పొత్తును గాల్లో పట్టుకుని కత్తితో కోయడానికి ప్రయత్నిస్తే కత్తి జారి చేతికి గాయమయ్యే ప్రమాదం ఉంది. ఎల్లప్పుడూ ఒక స్థిరమైన గిన్నె లేదా బోర్డుపై నిలబెట్టే కోయాలి.

మరీ లోతుగా కట్ చేయొద్దు: గింజలను కోసేటప్పుడు కత్తిని మరీ లోపలి వరకు నొక్కకూడదు. కేవలం గింజలు మాత్రమే తెగేలా జాగ్రత్తపడాలి. లోపల ఉండే పీచు రాకుండా చూసుకుంటే వంటకం రుచిగా ఉంటుంది.