
క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గర రిటైర్డ్ టీచర్‌ను దృష్టి మళ్లించి, డబ్బులు డిపాజిట్ చేసినట్లు నటించి రూ.90 వేలతో పరారైన నిందితుడిని అరెస్ట్ చేశారు కేపీహెచ్‌బీ పోలీసులు. ఆగస్టు 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో 56 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లోని ఎస్‌బీఐ బ్యాంకుకు నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చారు. అదే సమయంలో నిందితుడు కురంగి విద్యాసాగర్ (32) ఆమెను మాటల్లో పెట్టి, డబ్బులు డిపాజిట్ చేసినట్లు నమ్మించి రూ.90 వేల నగదుతో పరారయ్యాడు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 21న విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకుని, అతని దగ్గర నుంచి రూ.70 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
బీటెక్ పూర్తి చేసిన విద్యాసాగర్ స్నేహితుల ప్రభావంతో నేరాలకు అలవాటు పడి, ఇప్పటికే 19కు పైగా కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా… నేర ప్రవృత్తిని మార్చుకోలేదని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసేలా సిఫారసు చేస్తామని అన్నారు సీఐ విజయ్ కుమార్.