
భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయలది ప్రత్యేక స్థానం. పప్పు, కూరలు, చట్నీలు ఏవైనా సరే.. కాస్తంత పచ్చిమిర్చి తగిలితేనే ఆ ఘాటు, రుచి వస్తాయి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొద్ది రోజులకే మెత్తబడి కుళ్లిపోవడం సాధారణంగా చూస్తుంటాం. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ఇంటి బాల్కనీలోనే లేదా డాబాపై కుండీలలోనే తాజాగా, ఎలాంటి రసాయనాలు లేని పచ్చిమిర్చిని సులభంగా పండించుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు, పెద్ద తోట కూడా అవసరం లేదు. వంటగదిలో వాడే బాగా పండిన లేదా ఎండిన ఎర్రటి మిరపకాయల నుండి విత్తనాలను సులభంగా తీయొచ్చు. ఈ విత్తనాలను ఒక రోజంతా ఎండబెట్టి, నాటే ముందు సుమారు రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల విత్తనం త్వరగా మొలకెత్తుతుంది. మొదటిసారి మొక్కలు పెంచేవారికి కూడా ఈ పద్ధతి ఎంతో సులభంగా ఉంటుంది.
మట్టి, కుండీ తయారీ
మొక్క వేర్లు లోపలికి విస్తరించడానికి వీలుగా ఉండే మధ్యస్థ పరిమాణపు కుండీ లేదా గ్రో బ్యాగ్‌ను ఎంచుకోవాలి. కుండీ అడుగుభాగంలో నీరు నిలవకుండా బయటకు వెళ్లేందుకు డ్రైనేజీ రంధ్రాలు తప్పనిసరి. సాధారణ మట్టిలో బాగా కుళ్లిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కలిపి సారవంతమైన పాటింగ్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి.
విత్తనాలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సిద్ధం చేసుకున్న మట్టిలో విత్తనాలను సుమారు 2 నుంచి 3 అంగుళాల లోతులో మాత్రమే చల్లాలి. మరీ లోతుగా నాటితే మొలకలు రావడం కష్టమవుతుంది.
- విత్తనాలు నాటిన తర్వాత పైపైన నీటిని చిలకరించి తేమగా ఉంచాలి. కుండీలో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి, లేదంటే విత్తనాలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
- ఒకే కుండీలో విపరీతంగా మొక్కలను ఉంచకూడదు. కుండీ పరిమాణాన్ని బట్టి ఒకటి లేదా రెండు ఆరోగ్యకరమైన మొక్కలను మాత్రమే ఉంచితేనే వీటికి పోషకాలు, గాలి సరైన మోతాదులో అందుతాయి.
ఎండ – సంరక్షణ
మిరప మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం. బాల్కనీలు, టెర్రస్ లేదా మంచి వెలుతురు వచ్చే కిటికీల దగ్గర ఈ కుండీలను ఉంచవచ్చు. నేల తేమను బట్టి అవసరమైనంత మేరకే నీరు అందించాలి.
రెండు నెలల్లోనే పంట చేతికి
సరిపడా ఎండ, క్రమం తప్పని పోషణ అందిస్తే నాటిన 30 నుంచి 40 రోజులకు మొక్కకు చిన్న తెల్లని పూలు పూస్తాయి. ఆ తర్వాత పిందెలు కట్టి, దాదాపు 60 రోజుల్లో నిగనిగలాడే పచ్చిమిరపకాయలు కోతకు వస్తాయి. స్వయంగా ఇంట్లోనే పండించుకున్న పచ్చిమిర్చితో వంటింటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చు.