
- ఇథనాల్ కు దేశీయ చెరుకు వాడకం
- సుంకం ఎత్తేసినా తగ్గని చక్కెర ధర
- విదేశాల నుంచి దిగుమతులకు ఓకే
న్యూఢిల్లీ:పెట్రోల్‌లో ఇథనాల్ కలిపారు.. వంటింట్లో చక్కెర ధరను మండించారు. ఈ–20 లక్ష్యంతో చెరుకు రసాన్ని భారీగా ఇథనాల్ తయారీకి మళ్లించడంతో దేశీయ పంచదార సరఫరాకు గండి పడింది. మరోవైపు పంట దిగుబడులు, చక్కెర రికవరీ తగ్గడం.. వ్యాపారుల నిల్వలు, పండుగల డిమాండ్ కలిసి ధరలను రికార్డు స్థాయికి చేర్చాయి. ప్రస్తుతం కిలో చక్కెర రూ.65 దాకా ఎగబాకగా.. హోల్‌సేల్ మార్కెట్లలో క్వింటాల్ రూ.5,350 దాటింది. ఎగుమతులను అడ్డుకున్నా.. ధరలు తగ్గకపోవడంతో చివరకు దశాబ్దం తర్వాత భారత్ దిగుమతుల బాట పట్టింది. గేట్లు ఎత్తివేయడంతో పాకిస్తాన్ చక్కెర భారత్ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నది.
నిత్యావసరాల్లో ఒకటిగా ఉన్న చక్కెర ధరలు పెరుగుతుండటం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రధాన చక్కెర వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హోల్‌సేల్ చక్కెర ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి దాదాపు 20 శాతం ఎగబాకి క్వింటాల్‌కు ఏకంగా రూ.5,350కి చేరాయి. పంజాబ్ రిటైల్ మార్కెట్లలో అత్యధికంగా కిలో ధర రూ.65 పలుకుతున్నది. ముంబై, భోపాల్, ఇతర నగరాల్లో నాణ్యతను బట్టి కిలో రూ.58 నుంచి రూ.63 మధ్య విక్రయిస్తున్నారు. యూపీలో ఫ్యాక్టరీ గేటు వద్ద ఎమ్ -గ్రేడ్ చక్కెర ధర క్వింటాల్‌కు రూ. 5,400కి చేరింది. ఢిల్లీలో స్పాట్ మార్కెట్ ధరలు క్వింటాల్‌కు రూ. 5,775కు, ముజఫర్‌నగర్‌లో క్వింటాల్‌కు రూ. 5,754కు చేరుకున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర రూ.52.30గా నమోదైంది. 2023 తొలినాళ్లలో రూ.40–45గా ఉన్న రేటు నిరుడు ఆగస్టు నాటికి రూ.46.30కి, ఇప్పుడు ఏకంగా రూ.52 పైకి చేరి ఏడాది కాలంలోనే దాదాపు 13% పెరిగింది.
సంక్షోభానికి అసలు మూలం ఇథనాల్ రష్
ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ20 (పెట్రోల్‌లో 20% ఇథనాల్ బ్లెండింగ్) ప్రోగ్రామే చక్కెర కొరతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ (ఏఐడీఏ) లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 1,822 కోట్ల లీటర్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 30 నుంచి 35 శాతం ఫీడ్‌స్టాక్ నేరుగా చెరుకు నుంచే వస్తోంది (మిగిలినది మక్కజొన్న, బియ్యం ద్వారా సమకూరుతోంది). భారీగా చెరుకు రసాన్ని డిస్టిలరీల వైపు మళ్లించడంతో పంచదార ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
గత ఏడాది సుమారు 27 లక్షల టన్నుల పంచదారను ఇథనాల్ తయారీకి మళ్లించారు. చమురు దిగుమతులు తగ్గించడం ద్వారా ఆదా చేసే విదేశీ మారకద్రవ్యాన్ని… ఆహార పదార్థాల దిగుమతుల కోసం ఖర్చు చేయాల్సి వస్తే అది ఆందోళనకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, యూపీలో చెరుకు విస్తీర్ణం 1.5% పెరిగినప్పటికీ.. పంటకు సోకిన తెగుళ్ల కారణంగా చెరకు దిగుబడి, చక్కెర రికవరీ రేటు తగ్గిందని లక్నో వర్సిటీ ప్రొఫెసర్, యూపీ ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు సుధీర్ పన్వార్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సరఫరా అంచనాలు తప్పడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఆయన విశ్లేషించారు. ధరలు ఇంకా పెరుగుతాయనే భయంతో బల్క్ కొనుగోలుదారులు సాధారణంగా 10––15 రోజులకు సరిపడా కొనే బదులు ఏకంగా 2 నెలల నిల్వలను ఒకేసారి కొనుగోలు చేయడంతో మార్కెట్లో కృత్రిమ డిమాండ్ ఏర్పడింది. మరోవైపు మహారాష్ట్ర, కర్నాటకలాంటి ప్రధాన చెరకు ఉత్పత్తి రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గడం వల్ల రాబోయే సీజన్ దిగుబడిపై ఆందోళనలు
వ్యక్తమవుతున్నాయి.
భవిష్యత్ సరఫరాలపై నీలినీడలు
రాబోయే 2026–-27 చక్కెర సీజన్‌లో ఉత్పత్తి, లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2026 అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న నూతన సీజన్‌కు సంబంధించి దేశీయ నిల్వలపై అనిశ్చితి నెలకొంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం రాబోయే సీజన్ నాటికి ప్రారంభ నిల్వలు 40 నుంచి 42 లక్షల టన్నులు (4–4.2 మిలియన్ టన్నులు) గా ఉండే అవకాశం ఉంది. కానీ మార్కెట్ విశ్లేషకులు ఇది మరింత తగ్గి 32 నుంచి 35 లక్షల టన్నులకే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా దేశీయ అవసరాల కోసం కనీసం 50 లక్షల టన్నుల ప్రారంభ నిల్వలు ఉండాలి.. కానీ ప్రస్తుత రెండు అంచనాలు అంతకంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో 285 లక్షల టన్నుల స్థానిక వినియోగ డిమాండ్‌కు గాను మొత్తం చక్కెర లభ్యత సుమారు 320 లక్షల టన్నులుగా ఉంది. ఇప్పటికే దాదాపు 7 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కాగా, ప్రస్తుత 2025–-26 ముగింపు నాటికి నిల్వలు సుమారు 35 లక్షల టన్నులకు పడిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్‌లో చక్కెర లభ్యత, ధరల స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఎగుమతుల నిషేధం నుంచి దిగుమతుల వైపు..
బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారుగా ఉన్న భారత్ (2021–-22లో ఏకంగా 12 మిలియన్ టన్నులు ఎగుమతి చేసింది).. ప్రస్తుత సీజన్‌లో పరిస్థితులు తలకిందులవడంతో రక్షణ చర్యలు చేపట్టింది. 2025-–26 మార్కెటింగ్ ఏడాదికి ఎగుమతుల కోటాను కేవలం 2 మిలియన్ టన్నులకే పరిమితం చేసింది. దేశీయ అవసరాల దృష్ట్యా ఈ ఏడాది మే 13 నుంచి సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది. అయినా ధరలు అదుపులోకి రాకపోవడంతో, విదేశాల నుంచి చక్కెరను తెప్పించేందుకు దశాబ్ద కాలంగా అమలులో ఉన్న 100% దిగుమతి సుంకాన్ని (కస్టమ్స్ డ్యూటీ) పూర్తిగా రద్దు చేసింది. దాదాపు పదేండ్ల తర్వాత 10 లక్షల టన్నుల (1 మిలియన్ టన్నులు) ముడి పంచదారను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అదే సమయంలో అక్రమ నిల్వలు, స్పెక్యులేషన్‌ను అడ్డుకునేందుకు కీలక చర్యలు చేపట్టింది. కూల్‌డ్రింక్స్, మిఠాయి తయారీదారులు, ఆహార ప్రాసెసర్లలాంటి పెద్ద వినియోగదారులను కలుపుకొని, కేంద్రం సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు బల్క్ వినియోగదారులకు చక్కెర నిల్వ పరిమితిని 15 రోజులకు తగ్గించింది. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు ఇంధన స్వయంసమృద్ధి లక్ష్యం, మరోవైపు దేశీయ ఆహార ద్రవ్యోల్బణం మధ్య కేంద్ర ప్రభుత్వం తీవ్ర సందిగ్ధంలో పడింది.
ఆహార భద్రతపై రాజీ పడొద్దు: ఆర్థికవేత్తల హెచ్చరిక
ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధించాలనే తాపత్రయంలో వంటింటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేయకూడదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ సైతం.. ఆహారం వర్సెస్ ఇంధనం ప్రభావాన్ని క్షుణ్నంగా అంచనా వేసేవరకు ఈ20 స్థాయి వద్దే ఆగాలని, అంతకుమించి బ్లెండింగ్‌ను పెంచే ఆలోచన చేయవద్దని స్పష్టం చేశారు. కేంద్రం ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలతోపాటు ఇథనాల్‌కు కేటాయించే చెరకు పరిమాణాన్ని తాత్కాలికంగా తగ్గించి చక్కెర తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంలాంటి నిర్ణయాలపై వేగంగా స్పందించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఇథనాల్ కంపెనీల కోసమే ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని ‘టీమ్ భారత్’ వ్యవస్థాపకుడు తెహసీన్ పూనావాలా ఆరోపించారు. దీనిపై ఆగస్టు 22, 23 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన, నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు.
భారత్‌కు పాకిస్తాన్ చక్కెర?
దేశీయంగా చక్కెర ధరలు అమాంతం పెరగడంతో భారత ప్రభుత్వం దిగుమతి సుంకం లేకుండా చక్కెర దిగుమతులకు పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్‌కు తమ మిగులు చక్కెరను ఎగుమతి చేసేందుకు పాకిస్తాన్ చక్కెర పరిశ్రమ ఆసక్తి చూపుతోంది. రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య ఉద్రిక్తతల కారణంగా అటారీ-–వాఘా సరిహద్దుతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. పాకిస్తాన్‌లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు చక్కెర నిల్వలు పేరుకుపోయాయి. రాబోయే నవంబర్ క్రషింగ్ సీజన్‌లో దాదాపు 80 లక్షల టన్నుల మేర భారీ ఉత్పత్తి వచ్చే అవకాశం ఉండటంతో.. పాత నిల్వలు అమ్ముడుపోకపోతే రైతులకు చెల్లింపులు చేయడం, కొత్త పంటను కొనుగోలు చేయడం కష్టమవుతుందని పాక్ మిల్లులు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు ఎగుమతి చేసేందుకు అనుమతించాలని పాకిస్తాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (పీఎస్‌ఎంఏ) ప్రతినిధి చౌదరి ముహమ్మద్ వహీద్ అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. దీనివల్ల పాక్‌కు విదేశీ మారకద్రవ్యం లభించడంతో పాటు నిల్వ ఖర్చులు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, పాక్ నుంచి చక్కెర భారత్‌కు చేరడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎలాంటి అధికారిక వాణిజ్య ఒప్పందం లేదు.
అందరికీ షుగరే.. చక్కెర ధర పెరిగితే నష్టమేంటి?: బిహార్ మంత్రి శ్రవణ్
బిహార్‌లో చక్కెర ధరల పెరుగుదలను సమర్థిస్తూ ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో డయాబెటిస్ (మధుమేహం) కేసులు పెరిగిపోతున్నందున ప్రజలు పంచదార వాడకం తగ్గించారని, కాబట్టి ధరలు పెరిగినా ఎవరికీ పెద్దగా నష్టం లేదంటూ వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం ప్రజలు చక్కెర వాడకాన్ని బాగా తగ్గించారు. అందరికీ డయాబెటిస్ వస్తోంది..అసలు ఈ రోజుల్లో స్వీట్లు ఎవరు తింటున్నారు? అందుకే పంచదార ధర పెరిగినా ప్రజలపై పెద్దగా ప్రభావం పడదు.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని మీడియాతో అన్నారు. బిహార్‌లో గతంలో కిలో చక్కెర ధర రూ. 48 నుంచి రూ. 50 వరకు ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ. 65 దాటింది. కాగా, మంత్రి వ్యాఖ్యలపై స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పేడపై ఎంత నెయ్యి పోసినా అది పేడలాగే ఉంటుంది తప్ప మారదు. ఇలాంటి మంత్రుల నుంచి ఇంకేం ఆశించగలం? గతంలో గ్యాస్, టమాటాల ధరలు పెరిగినప్పుడు గళమెత్తిన నాయకులు.. ఇప్పుడు పంచదార ధరలు పెరిగితే డయాబెటిస్ సాకులు చెబుతున్నారు. అసలు ప్రజల పాలిట ప్రభుత్వమే అతిపెద్ద డయాబెటిస్” అని విమర్శించారు.
చక్కెర నిల్వలపై పరిమితులు
విపరీతంగా పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేయడానికి కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చక్కెరను వాడే బల్క్ కస్టమర్లు ఇక నుంచి 15 రోజులకు మించి స్టాక్‌ను ఉంచుకోకూడదు. కొత్త రూల్ ఈ ఏడాది నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. సరఫరాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మనదేశంలో ఆగస్టు–నవంబర్ వరకు పండుగల కారణంగా చక్కెరకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. స్వీట్ల తయారీదారులు ముందుగానే పెద్దఎత్తున నిల్వలను సమకూర్చుకుంటారు. డీలర్లు తమ వద్ద 30 రోజులకు మించి నిల్వలు ఉంచుకోవద్దని గత నెల ఆదేశించినా ధరలు తగ్గలేదు సరికదా పది శాతం పెరిగాయి.
షుగర్ రేట్ల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదు!
దేశంలో చక్కెర ధరలు గత పది రోజుల్లో కిలోకు రూ.2 నుంచి రూ.8 వరకు పెరిగాయి. ఈ పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణమన్న ఆరోపణలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ కొట్టిపారేసింది. ఊహించిన దానికంటే తక్కువ చక్కెర ఉత్పత్తి, పండుగల ముందు పెరిగిన డిమాండ్, వాతావరణం వల్ల పంట నష్టం, ప్రపంచవ్యాప్తంగా సరఫరాలు తగ్గడం ప్రధాన కారణాలని తెలిపింది. వ్యాపారుల వద్ద నిల్వలు, ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు కూడా రేట్లు పెరగడానికి కారణమని పేర్కొంది. ఇథనాల్ కోసం చక్కెర వినియోగం గతంతో పోలిస్తే తగ్గిందని స్పష్టం చేసింది. 2022–-23లో 12 శాతంగా ఉన్న చక్కెర వినియోగం.. 2025–-26లో 9 శాతానికి తగ్గిందని తెలిపింది.