ప్రీమియమే కాదు, కవరేజ్ కూడా ముఖ్యం: చాలామంది తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను ఎంచుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. కానీ దాని ద్వారా ఎంత కవరేజ్ లభిస్తుందనేది ఆలోచించరు. మనం తీసుకునే కవరేజ్ మన కుటుంబ అవసరాలకు సరిపోతుందో లేదో కచ్చితంగా చూసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు భవిష్యత్తులో వచ్చే భారీ వైద్య ఖర్చులను తట్టుకునేలా సరిపడా కవరేజీని ఎంచుకోవాలి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆదాయం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత కవరేజ్ ఉండేలా చూసుకోవాలి.
మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్లు:పాలసీ తీసుకునే ముందే అది ఏ వ్యాధులకు వర్తిస్తుంది, వేటికి వర్తించదు అనే వివరాలను స్పష్టంగా తెలుసుకోవాలి. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్, కో-పేమెంట్, రూమ్ రెంట్ పరిమితులు, సబ్-లిమిట్లను క్షుణ్ణంగా చదవాలి. ఆసుపత్రిలో చేరిన తర్వాత సదరు వ్యాధికి పాలసీ వర్తించదని తెలిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పాలసీ వేటికి వర్తిస్తుంది, వేటికి వర్తించదు అనే సమాచారంపై పూర్తి స్పష్టత ఉండాలి.
కంపెనీ వివరాలు, సేవా నాణ్యత: మీరు హెల్త్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకుండా పాలసీ కవరేజ్ వివరాలు, రెన్యూవల్ నిబంధనలు, పాలసీ నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా సదరు బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, సేవా నాణ్యత ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం.
బీమాను, పెట్టుబడిని కలపవద్దు: చాలామంది ఇన్సూరెన్స్‌ను పెట్టుబడిగా భావిస్తారు. కానీ బీమా వేరు, పెట్టుబడి వేరు. బీమా అనేది అనుకోని ఆపదల నుంచి రక్షణ కల్పిస్తుంది; పెట్టుబడి అనేది సంపద సృష్టికి దోహదపడుతుంది. కాబట్టి కుటుంబ రక్షణ కోసం ప్యూర్ టర్మ్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. భవిష్యత్ సంపద కోసం మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు లేదా ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకోవచ్చు.
పాలసీల నిరంతర సమీక్ష: 25 ఏళ్ల వయసులో తీసుకున్న కవరేజ్ జీవితాంతం సరిపోదు. వయసు, వివాహం, పిల్లల బాధ్యతలు, గృహ రుణాలు, జీవనశైలి మార్పులతో పాటు మన బీమా అవసరాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక బాధ్యతలు పెరిగినప్పుడల్లా దానికి తగినట్లుగా హెల్త్ లేదా టర్మ్ కవరేజీని సమీక్షించుకుంటూ పెంచుకోవడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు పాటిస్తే అత్యవసర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.




