Reading Time: 2 minutes
Hyper Adhi Speech At Mega Star Chiranjeevi Birthday Celebrations

Hyper Adhi: మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మహోత్సవం కార్యక్రమంలో సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది చేసిన ప్రసంగం హైలెట్ గా నిలిచింది. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే.. మెగాస్టార్ అభిమానుల భావోద్వేగాలను తన మాటల్లో బయటపెట్టాడు.

90వ దశకం జనరేషన్ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ.. తమ తరం చందమామను చూస్తూ తిన్నదని, చిరంజీవిని చూస్తూ పెరిగిందని, పవన్ కళ్యాణ్‌ను చూస్తూ అభిమానంతో అరిచిందని, రామ్ చరణ్‌ను చూస్తూ గర్వపడుతోందని చెప్పారు. చిన్నతనంలో ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్కింటికి వెళ్లి సినిమాలు చూసేవాళ్లమని.. అయితే ఇతర హీరోల సినిమాలు అయితే మధ్యలోనే వచ్చేసేవాళ్లమని.. చిరంజీవి సినిమా వస్తే మాత్రం సినిమా పూర్తయ్యే వరకు కదలకుండా చూసేవాళ్లమని అన్నారు. గ్రీటింగ్ కార్డుల నుంచి హాస్టల్ గదుల్లోని పోస్టర్ల వరకు చిరంజీవితో తమ తరానికి ఉన్న అనుబంధాన్ని ఆది వివరించారు. ఈ జనరేషన్‌కు చిరంజీవి ఒక హీరో కావచ్చు కానీ.. తమకు మాత్రం ఆయన వన్ అండ్ ఓన్లీ హీరో అని అన్నారు.

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా కుటుంబం నుంచి వచ్చిన ప్రతి హీరోకు ప్రత్యేకమైన అభిమానగణం ఉందని ఆది పేర్కొన్నారు. అయితే వారందరికీ మొదటి టికెట్ చిరంజీవి అభిమానిదేనని చెప్పుకొచ్చారు. మెగా హీరోల అభిమానానికి పునాది వేసింది చిరంజీవి అభిమానులేనని తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేశారు. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డులను తర్వాతి తరాల ఆటగాళ్లు అధిగమించినట్లే.. సినిమాల్లో కూడా రికార్డులు మారుతూ ఉంటాయని అన్నారు. కానీ చిరంజీవి డ్యాన్స్, నటన, అభిమానగణం, సేవా గుణం వంటి విషయాల్లో ఆయన నెలకొల్పిన రికార్డులను ఎవరూ అందుకోలేకపోయారని పేర్కొన్నారు. ఆయనను చాలామంది అనుసరించారని మాత్రమే చెప్పారు.

‘స్వయంకృషి’, ‘విజేత’, ‘ఆపద్బాంధవుడు’, ‘మగమహారాజు’ వంటి సినిమాల పేర్లు కేవలం టైటిల్స్ మాత్రమే కాదని.. అవన్నీ చిరంజీవి జీవితానికి ప్రతిబింబాలని హైపర్ ఆది వ్యాఖ్యానించారు. ఇతర హీరోల అభిమానులు వసూళ్ల గురించి మాట్లాడుకుంటే.. చిరంజీవి అభిమానులు మాత్రం తమ హీరో ఎంతమందికి సహాయం చేశారనే విషయాన్ని మాట్లాడుకునే స్థాయికి ఆయన తీసుకెళ్లారని అన్నారు.

మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు అగ్ర హీరోలు చిరంజీవిని ఆదర్శంగా భావిస్తారని హైపర్ ఆది పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవిపై చూపించే గౌరవాన్ని గుర్తుచేస్తూ.. మెగా కుటుంబంలో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని వివరించారు. “తోపులందరూ కలిసి డిసైడ్ చేసిన తోపే చిరంజీవి” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. చిరంజీవి సేవా గుణాన్ని కూడా హైపర్ ఆది ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకోవడం, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం ఆయన గొప్ప మనస్తత్వానికి నిదర్శనమన్నారు.

చిన్న సినిమాలకు కూడా చిరంజీవి అండగా నిలిచారని ఆది పేర్కొన్నారు. ‘బలగం’, ‘కోర్టు’, ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాలకు ఆయన ఇచ్చిన మద్దతును గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంటి తలుపు తట్టవచ్చనే నమ్మకం సినీ వర్గాల్లో ఉందని అన్నారు. చిరంజీవి స్వభావాన్ని కర్ణుడితో పోల్చిన ఆది.. ఆయన భార్య సురేఖ సేవా గుణాన్ని డొక్కా సీతమ్మతో పోల్చారు.

మరోవైపు ఇటీవల చిరంజీవిపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని కూడా హైపర్ ఆది తన ప్రసంగంలో ప్రస్తావించారు. చిరంజీవి ఎవరినీ తొక్కలేదని.. నంబర్ వన్‌గా ఎవరూ ఉండలేరనే అహంకారాన్ని, బాలీవుడ్ కలెక్షన్లపై ఉన్న భ్రమలను, డ్యాన్స్‌పై ఉన్న పరిమిత ఆలోచనలను ఆయన తొక్కుకుంటూ ముందుకు వచ్చారని అన్నారు. తన కొడుకు సక్సెస్ కాలేడనే భావనలను కూడా అధిగమించి రామ్ చరణ్‌ను అగ్ర హీరోగా నిలబెట్టారని వ్యాఖ్యానించారు. ఎంత నెగెటివిటీ వచ్చినా అది చిరంజీవి స్థాయిని ఏమాత్రం ప్రభావితం చేయదని అన్నారు. ఇంకా ఇండస్ట్రీకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా, చిరంజీవికి వందేళ్లు వచ్చినా సింహాసనంపై కూర్చొనే అర్హత ఆయనకే ఉంటుందని చెబుతూ.. “అక్కడ ఆ ఇంద్రుడిది.. ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.