
అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల సలహాలు వస్తున్నాయి. వీసా రూల్స్, కఠినమైన ఇమ్మిగ్రేషన్ చట్టాలు, మార్కెట్ మందగమనం వంటి కారణాల రీత్యా కొందరు NRIలు అమెరికా ప్రయాణాన్ని విరమించుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వార్తల వెనుక అసలు నిజం వేరే ఉందని, కొందరి స్వార్థమే దీనికి కారణమని ఒక ఎన్సారై టెక్కీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఎక్కువమంది NRIలలో అసూయ..
అమర్‌నాథ్ శివశంకర్ అనే NRI ఎక్స్ పోస్ట్ సంచలనం సృష్టించింది. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మరికొంతమంది ప్రతిభావంతులు భారతదేశం నుంచి అమెరికాకు రావడం ఇష్టపడరని తేల్చిచెప్పారు. దీనికి ప్రధాన కారణం పోటీ పెరిగిపోవడం, తమ ఆధిపత్యం కోల్పోతామనే భయమేనని బయటపెట్టారు. ఇండియాలో నిజంగానే అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉంటే.. ఈ NRIలు ఎందుకు తిరిగి స్వదేశానికి వెళ్లడం లేదు? అంటూ సూటిగా ప్రశ్నించడం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
విద్యార్థులకు టెక్కీ సలహాలు..
అమెరికా వెళ్లాలనుకునే యువతకు అమర్‌నాథ్ కొన్ని కీలక సూచనలు చేశారు. మీ దగ్గర తగినంత డబ్బు ఉండి, విపరీతమైన బ్యాంకు లోన్ల భారం పడకుండా ఉంటే మంచి యూనివర్సిటీని ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు గట్టిగా ఉండే కాలేజీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని.. ఎందుకంటే బయట ఉద్యోగం వెతుక్కోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత తేలికైన విషయం కాదని హెచ్చరించారు. విదేశీ ప్రయాణాన్ని జీవితంలో ఒక గొప్ప అనుభవంగా భావించాలని, విదేశాల్లో పని చేయడం వల్ల వచ్చే సవాళ్లు, క్లయింట్‌లతో అనుభవం భవిష్యత్తులో అద్భుతమైన లెర్నింగ్‌ను ఇస్తాయని పేర్కొన్నారు. అలాగే ఎప్పుడైనా మన దేశానికి తిరిగి వచ్చే స్వేచ్ఛ ఉంటుందని గుర్తుచేశారు.
నెటిజన్ల భిన్నాభిప్రాయాలు..
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 ఏళ్లకు పైగా అమెరికా అనుభవం ఉన్న ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఈ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని తెలిపారు. చైనా విద్యార్థులతో పోలిస్తే భారతీయ విద్యార్థుల ప్రొఫైల్స్ మారుతున్నాయని, ప్రస్తుత కాలంలో విజయం సాధించాలంటే కేవలం ప్రతిభే కాకుండా టైమింగ్, అదృష్టం కూడా చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
ALSO READ : మరికొన్ని గంటల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో ఆటోలు, క్యాబ్లు బంద్
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉందని కొందరు గుర్తుచేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానాలు చాలా కఠినంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీసా బ్యాక్‌లాగ్‌లు, ఉద్యోగ అభద్రత కారణంగా లాంగ్-టర్మ్ ప్లాన్స్ అంటే ఇల్లు కొనుకోవడం, ఆర్థిక భద్రతను ఏర్పరచుకోవడం వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడుతోందని కామెంట్లు చేశారు. ఏది ఏమైనప్పటికీ.. సొంత ప్రయోజనాల కోసం కొందరు చేసే హెచ్చరికలను గుడ్డిగా నమ్మకుండా, సరైన ప్లాన్ తో ముందుకు వెళ్లాలని టెక్కీ పోస్టు కనువిప్పు కలిగిస్తోంది.