
Bihar: చక్కెర ధర పెరుగుదలపై బీహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్‌లో కిలో చక్కెర ధర రూ. 65 దాటింది. గతంలో ఇది సుమారు రూ. 48-50గా ఉండేది. ధరల పెరుగుదలపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందిస్తూ.. చక్కెర ధరలు పెరిగినా ప్రజలపై పెద్ద ప్రభావం ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు డయాబెటిస్ కేసులు పెరగడంతో చాలా మంది చక్కెర తీసుకోవడం తగ్గించారని, దీంతో చక్కెర ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రజలు ఇప్పటికే తక్కువ చక్కెర తింటున్నారరి, అందరికి డయాబెటిస్ ఉందని, ఈ రోజుల్లో ఎవరు స్వీట్లు తింటున్నారు..? అని ప్రశ్నించారు. దీని వల్ల చక్కెర ధర పెరిగినా పెద్ద తేడా ఉండదని చెప్పారు. మరోవైపు బీహార్ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ధరల పెరుగుదలపై స్పందించారు. రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధర లభిస్తే తనకు సంతోషంగా ఉంటుందని అన్నారు. అయితే, చక్కెర ధర ఎందుకు పెరిగిందో పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై చక్కెర ఉత్పత్తి శాఖ మంత్రిని వివరాలు కోరుతామని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ తీవ్రంగా స్పందించారు. చక్కెర ధరల పెరుగుదకు డయాబెటిస్ కారణంగా చూపడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఆవు పేడలో ఎంత నెయ్యి పోసినా అది ఆవు పేడే. ఇలాంటి మంత్రి నుంచి ఏం ఆశించగలం.?’’ అని అన్నారు. గ్యాస్, టమాటా ధరలు పెరిగినప్పుడు స్మృతి ఇరానీ సహా పలువురు ప్రముఖ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారని, ఇప్పుడు చక్కెర ధరలు పెరిగితే డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నారని పప్పు యాదవ్ విమర్శించారు. ‘‘అసలు అతిపెద్ద డయాబెటిస్ ప్రభుత్వానికే ఉంది’’ అని వ్యాఖ్యానించారు.