
ముషీరాబాద్,వెలుగు: ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) డిమాండ్ చేసింది. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో ‘సీసీఐ పునరుద్ధరణ– ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలనే డిమాండ్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ 6వేల మందికి ప్రత్యక్షంగా, 10వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పరిశ్రమకు అన్ని రకాల సౌకర్యాలు, వనరులు ఉన్నాయని, ఇతర ప్రాంతాల్లో పోలిస్తే చౌకగా ఇక్కడ సిమెంట్ ఉత్పత్తి చేయవచ్చని వివరించారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణ పైన కక్షపూరితంగానే వ్యవహరిస్తుందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, జస్టిస్ చంద్రకుమార్, రూబీ స్టీవెన్ సన్, కారం రవీందర్ రెడ్డి, రవీందర్‌యాదవ్, చలపతిరావు, నందిరామయ్య, జోజిరెడ్డి, నవీన్, నాగరాజు పాల్గొన్నారు.