
- త్వరలోనే ప్రధాని మోదీ నిర్ణయం: ఎంపీ కె.లక్ష్మణ్
- నేను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న
- 22ఏ ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే రోజుల్లో కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నేతలకు సముచిత స్థానం దక్కుతుందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత దక్కలేదన్న వార్తలను ఖండించారు. పార్టీలో కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఇప్పటికీ తాను సభ్యుడిగా కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు. గురువారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ప్రజాపాలన కాకుండా దోపిడీ పాలన సాగుతోందని ఆరోపించారు. భూదందాలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భూ కుంభకోణాలు, సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని, ‘22ఏ’ జాబితాను తక్షణమే బహిర్గతం చేసి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కోరారు. ఎవరి ఆదేశాల మేరకు భూములను నిషేధిత (22ఏ) జాబితాలో పెట్టారో రెవెన్యూ మంత్రి పొంగులేటి సమాధానం చెప్పాలన్నారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులపై నెపం నెట్టి మంత్రి క్షమాపణలు చెప్పడం సిగ్గుచేటన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లే నిషేధిత జాబితాలో చేరిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కోటి ఎకరాలను ఆ జోన్ లోకి చేర్చారని ఆరోపించారు. ఆరోపించారు.
మాతాశిశు హక్కుల రక్షణకు కేంద్ర చట్టం తేవాలి!
బహిరంగ ప్రదేశాల్లో తల్లులు తమ పిల్లలకు గౌరవప్రదంగా, గోప్యతతో పాలు ఇచ్చేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సమగ్రమైన కేంద్ర చట్టం కోసం కృషి చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)ను లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్ కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, కోర్టులు, వర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులలో ప్రయాణించే, సందర్శించే తల్లులు, శిశువుల కోసం సురక్షితమైన మౌలిక వసతులు లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘మదర్ అండ్ చైల్డ్ కేర్ (పబ్లిక్ ఫెసిలిటీస్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అండ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్) యాక్ట్’’ పేరుతో సమగ్ర చట్టాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలన్నారు. ఈ అంశంపై కమిషన్ ముందుగా విస్తృతంగా స్టడీ చేయాలని సూచించారు.