
అంగన్వాడీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు కొత్త ఫుడ్ మెనూను ప్రవేశపెట్టింది. ఇక నుంచి పిల్లల వయస్సు ఆధారంగా ఫుడ్ అందించనున్నారు. మూడు వర్గాలుగా పిల్లలను విభజన చేశారు. 7 నెలల నుంచి 12 నెలల పిల్లలను జూనియర్లుగా పరిగణించనుండగా.. ఏడాది వయస్సు నుంచి మూడేళ్లలోపు ఉన్న పిల్లలను సీనియర్లుగా భావిస్తారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలను సూపర్ సీనియర్లుగా పరిగణిస్తారు. ఈ కేటగిరీల వారీగా వయస్సును బట్టి ప్రత్యేక ఫుడ్ మెనూను రూపొందించారు. ఈ కొత్త మెనూను అంగన్వాడీల్లో అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం
ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఒకే రకమైన బాలామృతం అందిస్తున్నారు. ఇందులో భాగంగా నెలకు 2.5 కిలోల చొప్పున బాలామృతం అందిస్తున్నారు. ఇకపై వయస్సు ఆధారంగా అందిస్తారు. ఏడు నుంచి 12 నెలలలోపు చిన్నారులకు గోధుమలు, శేరుశనగ నూనె, కందిపప్పు కలిసి బాలామృతం తయారుచేస్తారు. దీనిని 1.5 కిలోల చొప్పున ఏడు నెలల నుంచి 12 నెలల వయస్సు మధ్య ఉన్న చిన్నారులకు అందిస్తారు. ఇక ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలకు 2.5 కిలోల చొప్పున అందించనున్నారు. ఇక మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలకు వారంలో ఒకరోజు పులిహోర, వెజిటబుల్ రైస్ ప్రస్తుతం ఇస్తుండగా.. ఎగ్ ప్రైడ్ రైస్ కూడా అందించాలని కొత్త మెనూలో చేర్చారు.
వారానికి రెండ్రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్
వారానికి రెండ్రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు. దీంతో పాటు సాయంత్రం సమయంలో ప్రొటీన్ కోసం ఉడికించిన శనగలు పంపిణీ చేస్తారు. అన్ని వంటల్లో తప్పనిసరిగా మునగాకు వాడాలని ప్రభుత్వం తెలిపింది. సీడీపీఓ, సూపర్ వైజర్లు ఖచ్చితంగా మెనూను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ స్కూల్‌లోనూ ఈ ఫుడ్ మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త ఫుడ్ మెనూతో అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు మెరుగైన పోషకాహారం అదనంగా అందుతుంది. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ మార్పులు చేశారు. మంచి ఆహారం అందించడం వల్ల పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. అంగన్వాడీల్లో మంచి విద్యాభాస్యం అందించడమే కాకుండా ఆహారం కూడా అందించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఫుడ్ మెనూలో మార్పులు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు మార్పులు చేశారు.