
ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడమైన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే, దీని భద్రత వెనుక బలమైన పునాది ఉంది. ఇంజనీర్లు బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి పైల్డ్ రాఫ్ట్ ఫౌండేషన్ అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. భవనం కింద దాదాపు 3.7 మీటర్ల మందంతో చాలా భారీ కాంక్రీట్ రాఫ్ట్ నిర్మించారు. ఈ రాఫ్ట్ కింద దాదాపు 192 బలమైన కాంక్రీట్ స్తంభాలు నేలలోకి దింపబడ్డాయి. ప్రతీ పైల్ డయామీటర్ మందం దాదాపు 1.5 మీటర్లు ఉంటుంది.
పునాది ఎంత లోతుకు వెళ్ళింది?:
అధికారిక, సాంకేతిక నివేదికల ప్రకారం ఈ కాంక్రీట్ పైల్స్ భూమి లోపలికి దాదాపు 45 నుండి 50 మీటర్లు సుమారు 164 అడుగులు లోతు వరకు పాతుకుపోయాయి. సాధారణంగా ఒక్కో అంతస్తు ఎత్తు 3 మీటర్లు అనుకుంటే, 45-50 మీటర్లు అంటే దాదాపు ఒక 15 అంతస్తుల భవనమంత లోతుకు సమానం. అంటే భూమిపైన 828 మీటర్ల భవనం ఉంటే, దాని కింద 15 అంతస్తుల లోతైన పునాది అండగా నిలిచింది.
ఇసుక నేలలో అంత బలం ఎలా?:
దుబాయ్ భూభాగం ప్రధానంగా బలహీనమైన ఇసుక, ఇసుకరాయితో కూడుకుని ఉంటుంది. ఇంజనీర్లు దాదాపు 140 మీటర్ల లోతు వరకు భూమి పొరలను పరిశీలించారు. ఇక్కడ ఎలాంటి గట్టి రాతి పొరలు లేకపోవడంతో ఫ్రిక్షన్ పైల్స్ సాంకేతికతను వాడారు. అంటే, పైల్స్‌కు, దాని చుట్టూ ఉండే నేలకు మధ్య ఉండే రాపిడి వల్ల భవనం కిందకు కుంగిపోకుండా స్థిరంగా నిలబడుతుంది.
ఈ పునాది నిర్మాణం కోసం 45,000 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ కాంక్రీట్‌ను ఉపయోగించారు. దీని బరువు దాదాపు లక్ష టన్నులకు పైగా ఉంటుంది. దుబాయ్ భూగర్భ జలాల వల్ల కాంక్రీట్ దెబ్బతినకుండా ప్రత్యేక కోటింగ్స్, నిరోధక సాంకేతికతలను ఉపయోగించారు. ఇంజనీరింగ్ అద్భుతమైన బుర్జ్ ఖలీఫా దృఢత్వానికి ఈ నిగూఢమైన పునాదే అసలైన రహస్యం.