
హైదరాబాద్: మాదాపూర్లో ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ కారు ఢీ కొట్టడంతో ఇనార్బిట్ ఉద్యోగిని చనిపోయిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని డీసీపీ రితి రాజ్ చెప్పారు. నిందితుడు ఎంపీ కొడుకు అయినంత మాత్రాన తాము కాపాడడం లేదని, సోషల్ మీడియాలో పోలీసులపై జరుగుతున్న చర్చ కరెక్ట్ కాదని ఆమె తెలిపారు. పబ్లిక్ ఎమోషన్తో ఇన్వెస్టిగేషన్ చేయమని, తాగి కారు నడిపినా, డ్రగ్స్ మత్తులో యాక్సిడెంట్ చేసినా అరెస్ట్ చేయాలని చట్టం చెప్తుందని ఆమె వివరించారు.
సంజుష్ కేసులో అతను డ్రంకెన్, డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు లేవని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం వల్ల మాత్రమే యాక్సిడెంట్ జరిగిందని, ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ బెయిలబుల్ సెక్షన్ల కింద వస్తాయని రితిరాజ్ చెప్పారు. ఒక వ్యక్తి మరణానికి కారణం ర్యాష్ డ్రైవింగ్ అయితే అది నాన్ బెయిలబుల్ కిందకి రాదని ఆమె వివరించారు.
FIRలో తండ్రి పేరు, ఇంటి పేరు పెట్టకపోవడానికి పోలీసులకు అతని సమాచారం ఆలస్యంగా వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. నిందితుడు యాక్సిడెంట్ అయ్యాక పారి పోలేదని, పోలీసుల విచారణకు ఇంట్లోనే ఉన్నాడని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వాటికి తాము సమాధానం చెప్పలేమని, ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదని డీసీపీ రితి రాజ్ స్పష్టం చేశారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక అవసరం అయితే అరెస్ట్ చేస్తామని, ప్రస్తుతానికి నోటీస్ సర్వ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ఈ కేసు గురించి డీసీపీ రితి రాజ్ తెలిపారు. బాధితురాలికి కోర్టు ద్వారా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని డీసీపీ మీడియాకు వెల్లడించారు.