Reading Time: 2 minutes

611 స్కూల్స్‎కు బిల్డింగ్స్ లేవు: కాక్రోచ్ ఉద్యమంతో లెక్కలు చెప్పిన రాజస్థాన్

Caption of Image.

జైపూర్: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన స్కూల్ ఠీక్ కరో క్యాంపెయిన్ ప్రారంభించిన వేళ రాజస్థాన్‎లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి బట్టబయలైంది. రాజస్థాన్‎లో ఏకంగా 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. సంవత్సరాల కొద్ది అద్దె భవనాల్లోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో మరుగు దొడ్లు, తాగు నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాలను వెల్లడించింది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు గురించి ప్రతిపక్ష నాయకుడు (LoP) టికా రామ్ జుల్లీ అసెంబ్లీలో ప్రశ్న లెవనెత్తారు. ఆయన ప్రశ్నకు భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 611 ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనాలు లేవని తెలిపింది. ఇందులో 10 బాలికల పాఠశాలల సైతం ఉన్నాయి. 

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపాలకు అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని గత కాంగ్రెస్  ప్రభుత్వమే ఆరోపించింది. ఝలావార్ పాఠశాల ప్రమాదం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ పాపంగా అభివర్ణించింది. తమ ప్రభుత్వం పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది. 

ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, పునరుద్ధరణకు 550 కోట్ల రూపాయలు, భవనాలు లేని లేదా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నడుస్తున్న పాఠశాలల నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ నిధుల వనరుల ద్వారా పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం ఏటా రూ. 2,500 కోట్లు లేదా ఐదేళ్లలో రూ. 12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

రాష్ట్ర రాజధాని జైపూర్‌లోనే భవనాలు లేని 38 పాఠశాలలు ఉండటం గమనార్హం. ఝలావార్‌లోని అక్లేరా బ్లాక్‌లో అత్యధికంగా 23, ఆ తర్వాత ఖాన్‌పూర్‌లో 16, ఝల్‌రాపటన్‌లో 11 ఉన్నాయి. ఫలోడిలోని బాప్‌లో 11, బన్స్వారాలోని చోటిసర్వన్‌లో 10 పాఠశాలలకు సొంత భవనాలు లేవు. 

ALSO READ : 50 గజాల్లో ఏడంతస్తులు బిల్డింగ్ కట్టిర్రు

సొంత భవనాలు కలిగిన 64,484 ప్రభుత్వ పాఠశాలల్లో 2,047 స్కూళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. 1,049 పాఠశాలల్లో త్రాగునీటి సమస్య ఉంది. బాన్స్‌వారాలో అత్యధికంగా 188 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. దుంగార్‌పూర్‌లో 124, ఉదయ్‌పూర్‌లో 98 ఉన్నాయి. దౌసాలో అత్యధికంగా 96 పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యాలు లేవు.

స్కూల్ ఠీక్ కరో కార్యక్రమంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం (ఆగస్ట్ 21) రాజస్థాన్ లో పర్యటించింది. జైపూర్ సమీపంలోని బగ్రూలో ఒక ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయడానికి వెళ్లుండగా సీజేపీ బృందంపై గ్రామస్థులు దాడి చేసి తరిమివేశారు. ఈ ఘటనపై సీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

48 గంటల్లోగా నిందితులపై చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే జంతర్ మంతర్ తరహాలో రాజస్థాన్ రాజధాని జైపూర్‎లో నిరసనలు చేపడతామని హెచ్చరించింది. సీజేపీ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే రాజస్థాన్‎లోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన గణంకాలను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. 

©️ VIL Media Pvt Ltd.