
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అంశంలో రాజకీయాలు చేస్తూ వారిని తప్పుదారి పట్టిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ, ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అవకాశాలపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్న క్రమంలో స్పందించిన ఎంపీ వంశీకృష్ణ కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గందరగోళం సృష్టించడంలో కేటీఆర్ నంబర్ వన్ అని అన్నారు.
గతంలో గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు కేటీఆర్ పాత్రపై ప్రశ్నలు తలెత్తాయని ఆరోపించారు. ఈ అంశంలో గతంలో పరస్పర రాజకీయ ఆరోపణలు, విమర్శలు కూడా కొనసాగాయి. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వారి పక్షాన నిలిచి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థులతో చర్చించి వారికి భరోసా కల్పిస్తున్నామని, వారి ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాల విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజినీరింగ్ చదివే అవకాశాలు కొనసాగుతాయని, వారి ఉన్నత విద్యా ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసి తెలంగాణ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
►ALSO READ | ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన CM రేవంత్
విద్యార్థుల భవిష్యత్తును మరింత మెరుగుపరిచేందుకు రూ.800 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెంచడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడం, ఉన్నత విద్యలో విద్యార్థులకు మరింత అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణను విద్యా, నైపుణ్య రంగాల్లో ముందంజలో నిలపాలని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికిన ఎంపీ, విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. “విద్యార్థుల కోసం మేమున్నాం.. వారి భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తాం” అని అన్నారు ఎంపీ వంశీకృష్ణ