
- చర్చకు సిద్ధమని చెప్పి.. భయపడి పారిపోయిండు
- బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఆరోపణ
- సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమా అంటూ సీఎంకు సవాల్
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని, లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి అవినీతిపై చర్చించేందుకు పూర్తి ఆధారాలతో అసెంబ్లీ మీడియా పాయింట్‌కు వస్తే.. అక్రమాలు బయటపడతాయనే భయంతో పొంగులేటి రాలేదని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి ఏలేటి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. మంత్రి కోసం మధ్యాహ్నం 2 గంటల వరకు ఎదురుచూశామని, అయినా ఆయన రాకపోవడం పిరికితనానికి నిదర్శనమని విమర్శించారు.
సీబీఐ, ఈడీకి అప్పగించాలి..
సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పొంగులేటి అవినీతిపై వచ్చిన ఆరోపణలను సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఏలేటి సవాల్ చేశారు. ఫీనిక్స్ సంస్థకు సంబంధించిన రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులు మంత్రి సంబంధిత కంపెనీలకు ఎలా బదిలీ అయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది క్విడ్‌ప్రోకో వ్యవహారమని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఏటీఎంలా వాడుకుంటున్నారని ఏలేటి ఆరోపించారు. భూభారతి పేరుతో భూములకు ‘హారతి’ ఇస్తున్నారని, 22ఏ సెక్షన్ పేరుతో వేల కోట్ల రూపాయల భూదందా జరుగుతున్నదని విమర్శించారు. తాము చేస్తున్న ఆరోపణలు తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పారు. ఆరోపణలు తప్పని తేలితే ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.