Reading Time: 2 minutes

నీట్ ఆందోళనలో పోలీసుల చర్యలపై జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్డ్ కమిటీ

Caption of Image.

న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసుల బలప్రయోగంపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌ రెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. పంజాబ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ డాక్టర్ ఎల్.ఆర్. బిష్ణోయ్‎ను న్యాయస్థానం ఈ కమిటీలో సభ్యులుగా అపాయింట్ చేసింది. కాగా, నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన వారిపై పోలీసుల బల ప్రయోగంపై విచారణ చేపట్టాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసింది. 

నిరసనల సమయంలో పోలీసులు ఎంత మేరకు బలప్రయోగం చేశారు.. పరిస్థితికి అనుగుణంగానే చేశారా లేదా అనేది కమిటీ పరిశీలించనుంది. అలాగే, నిరసనకారులపై పెల్లెట్ గన్‌లు, ఎలక్ట్రిక్ లాఠీలు, లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ వాడకంపై కూడా విచారణ జరుపుతుంది. నిరసనల సమయంలో పోలీసు సిబ్బంది యూనిఫాంలు, నేమ్‌ప్లేట్లు ధరించారా లేదా అనే అంశాన్ని కూడా కమిటీ ధృవీకరిస్తుంది. నిరసనకారులపై నిఘా, పర్యవేక్షణకు సంబంధించిన ఆరోపణలపై కూడా విచారణ జరుపుతారు. 

మహిళా నిరసనకారులపై హింస, దుష్ప్రవర్తన, లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఈ విషయాలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించి ప్రాథమిక మధ్యంతర నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించింది. అలాగే, నిరసన సమయంలో పోలీసు సిబ్బందిపై హింస, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై అధికారులు లేవనెత్తిన ఆరోపణలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

ALSO READ : జార్ఖండ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. 

నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ ఫుటేజ్, బాడీ-వోర్న్ కెమెరా రికార్డింగ్‌లు, వీడియోలు, వైర్‌లెస్ లాగ్‌లు, పీసీఆర్ కాల్ రికార్డులతో సహా సాక్ష్యాలను భద్రపరచాలని పోలీసులు, పారామిలిటరీ దళాలు, దర్యాప్తు సంస్థలను ఆదేశించిన సుప్రీం కోర్టు ఈ రికార్డులన్నింటినీ కమిటీకి అందజేయాలని ఆదేశించింది. పోలీసు అధికారులపై శాఖాపరమైన లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి కమిటీ ఏర్పాటు అడ్డంకి కాదని.. ఎవరైనా అధికారి తప్పు చేసినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను 2026, సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

 

©️ VIL Media Pvt Ltd.