
మీరు రాబోయే వారంలో బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలనుకుంటున్నారా..? అయితే ముందుగా ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సిందే. తెలుసుకోకుండా బ్యాంకులకు వెళితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వచ్చే వారంలో పలు పండుగల సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు ఆదివారం సాధారణ సెలవు కావడంతో.. వచ్చే వారంలో బ్యాంకులు ఎక్కువ రోజులు పనిచేయవు. ఆదివారం, ప్రాంతీయ పండుగల సందర్బంగా బ్యాంకులు వచ్చే వారంలో ఏయే రోజుల్లో మూతపడతాయనేది ఒకసారి చూద్దాం.
ఆగస్ట్ 23వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు వస్తుంది. దీంతో ఆ రోజు క్లోజ్ చేసి ఉంటాయి. ఇక ఆగస్ట్ 25వ తేదీన మంగళవారం మిలాద్-ఉన్-నబీ/మొదటి ఓనం సందర్భంగా ఏపీ, కేరళలో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఆగస్ట్ 26న ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఆగస్ట్ 28వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ఉండవు. ఆగస్ట్ 30న ఆదివారం రావడంతో బ్యాంకులు మూసివేస్తారు. రక్షాబంధన్‌తో పాటు ఇతర స్థానిక పండుగల కారణంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, కేరళతో పాటు పలు ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు ఆగస్టు 28న మూసివేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ఆగస్టు 28న బ్యాంకు, ట్రెజరీ సెలవు దినంగా కూడా ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ రోజున పలు రాష్ట్రాల్లో బ్యాంకులు ఉండవ్. దీంతో ఆ రోజున వెళ్లేముందు ఒకసారి బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి తనిఖీ చేసుకోండి.
ఇవి పనిచేస్తాయి..
సెలవు రోజుల్లో కేవలం బ్యాంక్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. చెక్ బుక్కుల క్లియరెన్స్, రుణ సంబంధిత పత్రాల మాన్యువల్ ఆమోదం వంటి సేవలు నిలిచిపోతాయి. అయితే యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి ఆన్ లైన్ సేవలు పనిచేస్తాయి. దీంతో ఆన్ లైన్ ద్వారా బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.