Reading Time: < 1 minute

ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో ఇంకో నీతా?..విద్యార్థుల మీద లాఠీచార్జిపై రాహుల్ మౌనమెందుకు?: కేటీఆర్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో విద్యార్థుల తరపున ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌‌ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జి చేయిస్తున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని తప్పుబడుతున్న రాహుల్‌‌.. తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న దాడులపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్‌‌రెడ్డి జూబ్లీహిల్స్‌‌ నివాసం ముందు రాహుల్‌‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారో ప్రకటించాలని శుక్రవారం ఎక్స్‌‌లో చేసిన పోస్టులో కేటీఆర్‌‌ కోరారు.

తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించడం, వారిని ఈడ్చుకెళ్లడం, గొంతులు నొక్కి దాడులకు పాల్పడడం వంటి ఘటనలపై రాహుల్‌‌ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.విద్యార్థులపై పోలీసుల దమనకాండ ఢిల్లీలో జరిగినా.. తెలంగాణలో జరిగినా రాహుల్‌‌ గాంధీ ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్యత ఉందని కేటీఆర్‌‌ గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే రాహుల్‌‌ మౌనం వహిస్తున్నారని కేటీఆర్‌‌ విమర్శించారు.

©️ VIL Media Pvt Ltd.