Reading Time: < 1 minute
Tollywood Box Office 2026 Comeback Hits Chiranjeevi Ram Charan Raviteja Akhil

2026 టాలీవుడ్‌కి ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది చాలామంది స్టార్స్ కంబ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా, ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టుగా రికార్డుల మోత మోగించారు.

ఇక అదే సీజన్‌లో రిలీజ్ అయిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా కూడా శర్వానంద్‌కి మంచి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కెరీర్‌లో వరుస ప్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్‌కి ఇది కొత్త ఊపిరి పోసినట్లు అయింది. అదే విధంగా అక్కినేని అఖిల్ కూడా ‘లెనిన్’ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు; ఏకంగా 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లి కూర్చున్నాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ సైతం ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.

ఇక రామ్ చరణ్ సైతం ‘గేమ్ ఛేంజర్’ లాంటి డిజాస్టర్ తర్వాత ‘పెద్ది’తో మంచి హిట్ అందుకున్నాడు. ఓవర్సీస్‌లో అక్కడక్కడా కాస్త బ్రేక్ ఈవెన్ కాకపోయినా, ఓవరాల్‌గా ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా రవితేజ ‘ఇరుముడి’ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. కరోనా తర్వాత రిలీజ్ అయిన ‘క్రాక్’ అనంతరం ఆయన చేసిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా, ఏదీ హిట్ టాక్ తెచ్చుకోవడం కాదు కదా, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి.

కానీ ‘ఇరుముడి’ కంటెంట్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లడంతో పాటు, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్య ‘వీరభద్రుడు’ తర్వాత మరోసారి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో తెలుగులో సైతం మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. అదేవిధంగా సమంత ‘మా ఇంటి బంగారం’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ వంటి సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి.