Reading Time: 2 minutes

జార్ఖండ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. JPSC పరీక్షల రద్దు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు

Caption of Image.

రాంచీ: జార్ఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థుల నిరసనలకు తలొగ్గి JPSC పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించింది. JPSC పరీక్షలు, నియామకాలను రద్దు చేస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జార్ఖండ్ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. విచారణ అనంతరం.. జార్ఖండ్ హైకోర్టు జేపీఎస్సీ పరీక్షల రద్దుపై స్టే విధించింది.

కోర్టును ఆశ్రయించిన కొత్తగా నియమితులైన ఉద్యోగులకు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ రోషన్ ఇచ్చిన ఈ ఉత్తర్వు భారీ ఊరటనిచ్చింది. పిటిషనర్లు సౌరభ్ సింగ్, అవధేష్ కుమార్, దీప్ మాలా, సోనమ్ కుమారి తరఫున న్యాయవాదులు ఇందర్‌జీత్ సిన్హా, అమృతాంశ్ వాట్స్ వాదనలు వినిపించారు. అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు 39 పరీక్షలను రద్దు చేయగా, ఆరు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

వీటిలో ఈ మధ్య నియామకాలు జరిగిన ఉద్యోగాలు, అంతకుముందు జరిగిన పరీక్షలు కూడా ఉన్నాయి. జేపీఎస్సీ పరీక్షల ద్వారా ఎంపికై ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న పలువురు అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (JSSC-CGL) పరీక్ష రద్దు అత్యంత వివాదాస్పద నిర్ణయాలలో ఒకటిగా నిలిచింది. JSSC-CGL పరీక్షలో ఉత్తీర్ణులై, తదనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో నియమితులైన సుమారు 2 వేల మంది అభ్యర్థులు మంగళవారం రాంచీ వీధుల్లో నిరసనకు దిగారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత నిరసన తెలుపుతూ ఉద్యోగులు రోడ్డెక్కారు.

ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పులకు తమను శిక్షించకూడదనేది నిరసనలకు దిగిన ఉద్యోగుల వాదన. రాష్ట్ర సచివాలయం నుంచి బిర్సా చౌక్ వైపుగా నిరసన తెలుపుతూ ఉద్యోగులు ర్యాలీ చేశారు. నిరసనకారులలో చాలామంది ఇప్పటికే ఆర్థిక, హోం, రోడ్డు రవాణా, కార్మిక, సమాచార, పౌర సంబంధాల శాఖలతో సహా పలు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల్లో చేరారు. జార్ఖండ్‌లో పదవులకు ఎంపికైన తర్వాత తాము ఇతర ప్రభుత్వ, ప్రజా రంగ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేశామని కొందరు అభ్యర్థులు తెలిపారు.

అవకతవకలపై విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నియమితులైన అభ్యర్థులు స్పష్టం చేశారు. తాము నియమితులవడానికి కారణమైన ఎంపిక ప్రక్రియ తర్వాత, మొత్తం పరీక్షను రద్దు చేయడమే వారి ప్రధాన అభ్యంతరం. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే.. చట్టబద్ధమైన నియామక ప్రక్రియ ద్వారా నియామకాలు పొందిన అభ్యర్థులపై కాకుండా, బాధ్యులపై చర్య తీసుకోవాలనేది ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల వాదన.

©️ VIL Media Pvt Ltd.