Reading Time: < 1 minute

టెన్నిస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. US ఓపెన్ నుంచి సినర్ ఔట్

Caption of Image.

న్యూఢిల్లీ: ఇటలీ యువ సంచలనం, ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు జానిక్ సినర్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఈ మేజర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం (ఆగస్ట్ 21) అధికారిక ప్రకటన చేశాడు. తన కుడి మోకాలి గాయం కారణంగా రాబోయే యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఎంతో శ్రమించినప్పటికీ కుదరలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 

గాయం పూర్తిగా నయం కాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో యూఎస్ ఓపెన్‌లో పోటీ పడలేననే కఠిన నిర్ణయాన్ని తన బృందంతో కలిసి తీసుకున్నట్లు తెలిపాడు. యూఎస్ ఓపెన్ జరిగే న్యూయార్క్ తన హృదయానికి ఎంతో ప్రత్యేకమైనదని.. అక్కడి అభిమానుల మధ్య ఆడే అవకాశాన్ని కోల్పోవడంపై తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ నుంచి సినర్ దూరం కావడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

వింబుల్డన్ తర్వాత నో మ్యాచ్:

2026 వింబుల్డన్ టోర్నీ విజేతగా వరల్డ్ నెంబర్ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సినర్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ వింబుల్డన్ టోర్నీ సమయంలోనే సినర్ గాయపడ్డాడు. అయినప్పటికీ అలాగే పోరాటం కొనసాగించి టోర్నీ విజేతగా నిలిచాడు. 

►ALSO READ | WTC ఫైనల్ రేసులో బిగ్ ట్విస్ట్ : 4 జట్లు ఔట్, డేంజర్లో మరో 3 టీమ్స్.. భారత్ సంగతేంటి?

గాయం కారణంగా వింబుల్డన్ తర్వాత సినర్ ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. కెనడియన్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ టోర్నీల నుంచి కూడా వైదొలిగాడు. 2019లో గ్రాండ్ స్లామ్ అరంగేట్రం చేసిన తర్వాత సినర్ ఒక మేజర్ టోర్నమెంట్‌కు దూరం కావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇదిలా ఉంటే, గాయం కారణంగా ఆటకు దూరమైన మరో టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్‎తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 

©️ VIL Media Pvt Ltd.