Reading Time: < 1 minute

మీకు తప్ప మీరు మరెవరికీ చెందినవారు కాదు.. స్వేచ్ఛగా జీవించండి.. మహిళలకు రాహుల్ గాంధీ పిలుపు

Caption of Image.

పూణే: మహిళా సాధికారతనే లక్ష్యంగా మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మనుస్మృతిపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మహిళలు ఎవరికీ చెందినవారు కాదని, కనీసం తన భర్తకు, తండ్రికి కూడా కాదని చెప్పారు. భారతీయ మహిళలు హింస, అగౌరవం, నియంత్రణ, కాలం అనే ఉచ్చులో ఇన్నాళ్లూ చిక్కుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 70 కోట్ల మంది మహిళలే మన బలం అని ఆయన చెప్పారు.

స్త్రీలు స్వభావ రీత్యా పురుషుల కంటే ఎక్కువ సున్నితమైనవారని, సౌమ్యులని, కరుణామయులని, ముందుచూపు కలవారని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మహిళలు స్వతంత్రంగా ఉండాలని ఆకాంక్షించారు. ఒక మహిళకు తన జీవితంలో పురుషులతో ముడిపడి ఉన్న సంబంధబాంధవ్యాలు ముఖ్యమైనవేనని.. అలా అని అవి ఆమె గుర్తింపును గానీ, ఆమెపై యాజమాన్య హక్కును గానీ నిర్ణయించవని.. ఆ హక్కు పూర్తిగా ఆమెకే చెందుతుందని రాహుల్ గాంధీ మహిళా సాధికారత అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఒక మహిళ గుర్తింపు, స్వేచ్ఛ అనేవి ఆమె తండ్రి, భర్త, కొడుకులతో ఉన్న సంబంధంపై ఆధారపడి ఉండకూడదని ఆయన బలంగా చెప్పారు. మనుస్మృతి మహిళా స్వేచ్ఛను అణచివేసిందని.. మనుస్మృతిలో ఒక శ్లోకాన్ని ఆయన ప్రస్తావించారు. బాల్యంలో స్త్రీ తన తండ్రికి లోబడి ఉండాలని, యవ్వనంలో ఆమె భర్తకు చెందుతుందని, వృద్ధాప్యంలో కొడుకులకు చెందుతుందని మను స్మృతిలో చెప్పిన మాటలు సిగ్గుచేటు అని రాహుల్ గాంధీ విమర్శించారు.

దేశంలో మహిళలకు వారి సొంత కలలు, ఆకాంక్షలు, స్వీయ నిర్ణయాధికారం ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని.. మహిళలపై రుద్దబడిన ఆంక్షల పంజరాన్ని బద్ధలు కొట్టాలని రాహుల్ గాంధీ అక్కడికి వచ్చిన మహిళలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.