Reading Time: 2 minutes
Sugar Price Hike India Ethanol Production Government Clarification

Sugar Price Hike: దేశంలో చక్కెర ధరలు పెరగడం సామాన్యుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే, ఈ ధర పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణమే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తక్కువ చక్కర ఉత్పత్తి, చెరుకు పంటకు సోకిన తెగుళ్లు, అధిక వర్షపాతం, పెరిగిన డిమాండ్ వంటి అంశాలే ధరల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరుకును మళ్లించడం వల్ల దేశంలో చక్కెర కొరత ఏర్పడిందని, అందుకే ధరలు పెరిగాయనే విమర్శల నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

కిలో చక్కెర రూ. 48 నుంచి రూ. 55 వరకు..

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూలై 20న కిలో చక్కెర ధర రూ. 48గా ఉండగా, ఆగస్టు 20 నాటికి రూ. 55కు చేరింది. అంటే నెల రోజుల్లో కిలోకు రూ. 7-8 పెరిగింది. ఈ పెరుగుదల సామాన్యుడిపై భారం మోపింది.

ఇథనాల్ ఎందుకు కారణం కాదు..?

ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో సుమారు 12 శాతం ఉండగా, ఇది 2025-26 నాటికి 9 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడు వంతుల ధాన్యాల నుంచే వస్తోంది. ఇందులో మొక్కజొన్న ప్రధాన ముడిసరుకుగా ఉంది. దీనిని బట్టి చూస్తే ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదని తెలుస్తోంది.

ఉత్పత్తి తగ్గింది..

ప్రస్తుత సీజన్‌లో దేశ చక్కెర ఉత్పత్తి సుమారు 30.6 మిలియన్ టన్నులు ఉండొచ్చని అంచనా. ఇది గతంలో 34.3 మిలియన్ టన్నుల అంచనాతో పోలిస్తే చాలా తక్కువ. చెరకు పంటకు ఎర్రకుళ్లు, కాండం తొలుచు పురుగు వంటి తెగుళ్లు సోకడం, అధిక వర్షపాత కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉత్పత్తి తగ్గింది. అయితే, అక్టోబర్ లో మళ్లీ పంట కోతకు వచ్చే వరకు దేశీయ అవసరాలను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయి. 2026-27లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.3 మిలియన్ టన్నుల చక్కెర కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో జూన్ 30న టన్ను చక్కెర ధర $474గా ఉండగా, ఆగస్టు 20 నాటికి $552కు చేరింది. అంటే దాదాపు రెండు నెలల్లో ధర 16 శాతానికి పైగా పెరిగింది.

కేంద్రం చర్యలు..

చక్కెర మిల్లులు, వ్యాపారులు భారీగా నిల్వచేయడం కూడా పెంపుకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. దీనిని నియంత్రించేందుకు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితి విధించారు. సెప్టెంబర్ 1 నుంచి టోకు కొనుగోలుదారులు 15 రోజులకు మించి చక్కెర నిల్వ చేయకుండా పరిమితులు విధంచనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చక్కెర మిల్లల నిల్వలపై తనిఖీ చేయనున్నారు.

మరోవైపు, దేశంలో చక్కెర లభ్యత పెంచేందుకు ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి సుంకం రహిత అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో అక్టోబర్ 15 నుంచి క్రషింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్రాలు ,చక్కెర మిల్లుల్ని కోరింది.అక్టోబర్‌లో సాధారణంగా 3-4 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుండగా, ఈసారి అది 10 లక్షల టన్నులకు మించి ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.