Reading Time: 2 minutes

దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్.. దేశ జీడీపీలో 30 శాతం వాటా మాదే: సీఎం విజయ్

Caption of Image.

చెన్నై: దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్ అని.. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతానికి పైగా ఉందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. తయారీ, ఎగుమతులు, సేవలు, ఆవిష్కరణల్లో దక్షిణాది పాత్ర కీలకమని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఉమ్మడి పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేసి సమగ్ర ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు.

గురువారం (ఆగస్ట్ 20) దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని కోవళంలో జరిగిన ఈ సమావేశంలో డీలిమిటేషన్, రాష్ట్రాల మధ్య సమన్వయం, భద్రత, కేంద్ర–రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ.. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని సీఎం విజయ్ డిమాండ్ చేశారు. MBBS, BDS, AYUSH రాష్ట్ర కోటా సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీకి అనుమతించాలని కోరారు. 

కావేరి జలాలపై సుప్రీంకోర్టు తీర్పులు, అథారిటీ నిర్ణయాలు అమలు చేయాలని కోరారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టమని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను డీలిమిటేషన్‌తో శిక్షించకూడదని కోరారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాలను పరస్పర గౌరవం, చర్చలు, చట్టబద్ధ పాలన ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. బలమైన రాష్ట్రాలతోనే బలమైన భారత్ నిర్మాణం సాధ్యమని నొక్కిచెప్పారు.

‘డ్రగ్‌-ఫ్రీ సౌత్’ కోసం రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. డ్రగ్స్ రవాణా, తయారీ, పంపిణీపై రాష్ట్రాలు నిఘా సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అక్రమ విక్రయాలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్టులు, కోస్టల్ షిప్పింగ్, మత్స్య పరిశ్రమ, సముద్ర పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 1,076 కి.మీ. తీరప్రాంతంతో బ్లూ ఎకానమీలో భాగస్వామ్యానికి తమిళనాడు సిద్ధమని ప్రకటించారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రాల సొంత పన్ను ఆదాయ వనరులు పరిమితమయ్యాయని.. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరగకూడదని అన్నారు. రాష్ట్రాలకు న్యాయమైన ఆర్థిక వాటా కల్పించాలని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.