Reading Time: < 1 minute

ఆ అదృశ్య శక్తులు ఎవరో తేల్చండి: TPCC క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ

Caption of Image.

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. నా కుమార్తె వ్యాఖ్యల విషయంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులకు ఇప్పటికే తన వివరణ ఇచ్చానని ఆమె తెలిపారు. నోటీసులకు వివరణ ఇచ్చినప్పటికీ నన్ను, నా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. 

‘‘నా కుమార్తె వ్యాఖ్యల విషయంలో టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చా. అయినప్పటికీ తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీని కోరుతున్నా. 

పార్టీ క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం ఉంది. 

అదే సమయంలో ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని’’ అని మంత్రి సురేఖ లేఖలో కోరారు.

©️ VIL Media Pvt Ltd.