
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, రాజకీయ వేడి ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన మార్క్ పాలనా శైలిని నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెను తుఫాను రేపాయి. పరకాల నియోజకవర్గ రాబోయే ఎన్నికల టికెట్ వేదికగా ప్రారంభమైన ఈ రగడ, క్షణాల్లోనే అసలైన కాంగ్రెస్, వలస నాయకుల వివాదంగా మారి.. ప్రభుత్వం, పార్టీ అధిష్టానం ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే స్థాయికి చేరుకుంది.
ఈ వివాదానికి ప్రధాన మూలం పరకాల అసెంబ్లీ స్థానం. ఇటీవల పరకాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ ఉంటుందని, ఆయనను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రకటన చేశారు. ఇది కొండా కుటుంబంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పరకాల తమ రాజకీయ అడ్డా అని, కొండా మురళి ఇక్కడ గెలుపుకు కృషి చేశారని వ్యాఖ్యానించిన కొండా సుష్మిత.. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా టికెట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. టికెట్లు కేటాయించేది పీసీసీ, ఏఐసీసీ అధిష్టానమే గానీ కేవలం ఒక వ్యక్తి నిర్ణయం నడవదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. పదికాలాల పాటు సీఎం ఉంటానంటూ రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, గతంలో కొడంగల్‌లో ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి లాంటి అగ్రనేతలే ఎప్పుడూ అలా మాట్లాడలేదని, ఒరిజినల్ కాంగ్రెస్‌ను కాదని పచ్చ కాంగ్రెస్‌గా మారుస్తున్నారంటూ పరోక్షంగా టీడీపీ వలసల అంశాన్ని లేవనెత్తారు. బీసీ నేతలకు ప్రాధాన్యత తగ్గడమే కాకుండా.. రూ. 200 కోట్ల కమీషన్లు, షెల్ కంపెనీల ఆరోపణలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి పీఓపీ, సన్నిహితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిణామం కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ వెంటనే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణ మరింత ఆసక్తికరంగా మారింది. తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమైనవని, ఒకరి వ్యాఖ్యలకు మరొకరిని బాధ్యులను చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ, తనపై నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు. ఇక సుష్మిత నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానని, కేవలం రేవంత్ రెడ్డి వైఖరిని మాత్రమే ప్రశ్నించానని, పార్టీని గానీ రాహుల్ గాంధీని గానీ ఏమీ అనలేదని నష్ట నివారణ చర్యలకు దిగారు.
బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా..?
అయితే కొండా సురేఖ కుటుంబం తీసుకున్న ఈ స్వరంపై సీఎం రేవంత్ రెడ్డి వర్గం, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఏకంగా 18 మంది ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి ఉమ్మడిగా కొండా కుటుంబంపై విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా నేత, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతోనైనా సురేఖ సఖ్యతగా ఉన్నారా అని ప్రశ్నించారు. జిల్లా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్ సంస్కృతి నడవదని, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరైన పద్ధతి కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “మంత్రి అని గౌరవం ఇస్తుంటే, సంబంధం లేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా?” అంటూ నిలదీశారు. రూ. 200 కోట్ల ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వెనక ఉండి నడిపిస్తున్న గుంటనక్కల కుట్రలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మిగతా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, బాలు నాయక్, విప్ వేముల వీరేశం, బిర్లా ఐలయ్య, బల్మూరి వెంకట్ తదితరులు సుష్మిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. లక్షలాది మంది కార్యకర్తలు చెమటోడ్చి, కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే.. కేబినెట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన సొంత ప్రభుత్వంపైనే దాడికి దిగడం నైతికత కాదని వేముల వీరేశం మండిపడ్డారు. సమంత వివాదం నుంచి నేటి వరకు సురేఖ ఉపయోగించే భాష పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోందని, సీఎంను మూల్యం చెల్లించేలా చేస్తోందని విమర్శించారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే రీతిలో వ్యవహరిస్తున్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడమే కాకుండా, పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని అధిష్టానానికి, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ లకు బహిరంగ విజ్ఞప్తి చేశారు.
బయటపడుతున్న బలహీనతలు..
ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ లోని పునాది బలహీనతలను స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినప్పటికీ, పాత కాంగ్రెస్ (ఒరిజినల్ కాంగ్రెస్) నాయకులకు, రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన (వలస) నాయకులకు మధ్య అంతర్గత ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో కొండా కుటుంబం ద్వారా మళ్లీ బహిర్గతమైంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావన పాత తరం నేతల్లో లోలోపల ఉందనేది స్పష్టమవుతోంది. కానీ.. ఇలా అధికారంలో ఉండి కూడా సొంత కేబినెట్ మంత్రి, ఆమె కుటుంబం సీఎంపై పబ్లిక్‌గా విమర్శలు గుప్పించడం వల్ల కాంగ్రెస్ పార్టీ స్వీయ అపరాధంలో పడింది. ఒక పక్క రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్ వైఫల్యాలు, అంతర్గత కలహాలపై విమర్శల వర్షం కురిపిస్తుండగా, అధికార పార్టీ నేతలే ఈ తరహా రచ్చకెక్కడం ప్రతిపక్షాలకు పళ్లెంలో పెట్టి ఆయుధాలు ఇచ్చినట్లయింది. ప్రభుత్వంలో సమన్వయం లేదని, రెడ్డి వర్సెస్ బీసీ ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కొండా సుష్మిత మాటలు బలాన్ని చేకూర్చాయి.
అధిష్టానం ఈ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనే దానిపైనే తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ క్రమశిక్షణ ఆధారపడి ఉంది. కేవలం షోకాజ్ నోటీసులతో మమ అనిపిస్తే, భవిష్యత్తులో ఇతర అసంతృప్త నేతలు కూడా ఇదే బాట పడతారు.. ఇది ప్రభుత్వం స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా కఠిన చర్యలు తీసుకుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా వర్గం ఎలాంటి తిరుగుబాటు నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, కాంగ్రెస్ లోని ఈ రచ్చ.. ప్రతిపక్షాలకు పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే కాకుండా, సొంత కాళ్లపై తీవ్రంగా దెబ్బకొట్టుకునేలా చేసిందనడంలో సందేహం లేదు.