
బ్రిటన్: లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో శుక్రవారం (ఆగస్ట్ 21) సీఎం ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ఆక్స్‌ఫర్డ్ అనుబంధ విద్యాసంస్థల్లోని నూతన సంస్థల్లో ఇది ఒకటి.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని క్యాంపస్‌లో కలిశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి భారతదేశంతోనూ ప్రత్యేక అనుబంధం ఉందని.. మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యాభ్యాసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు, ప్రతినిధులు ఉన్నారు.