
BWF World Championships 2026: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2026లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ, ప్రపంచ నంబర్-1 జోడీతో హోరాహోరీగా పోరాడి సాధించిన ఈ పతకం భారత మహిళల డబుల్స్‌కు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్‌లో త్రిషా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ చైనాకు చెందిన ప్రపంచ నంబర్-1, డిఫెండింగ్ ఛాంపియన్లు లియు షెంగ్‌షు–టాన్ నింగ్ జంటను ఎదుర్కొంది. సుమారు గంటా 11 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ 21-18, 13-21, 8-21 తేడాతో ఓటమి చవిచూసింది.
తొలి గేమ్‌లో అద్భుత పోరాటం
స్వదేశీ ప్రేక్షకుల భారీ మద్దతుతో బరిలోకి దిగిన త్రిషా, గాయత్రి ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఒక దశలో చైనా జోడీ 18-16 ఆధిక్యంలోకి వెళ్లినా, భారత క్రీడాకారిణులు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా ఐదు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను 21-18తో సొంతం చేసుకున్నారు. ఇక, రెండో గేమ్‌లో ఇరు జట్లు 12-12 వరకు నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడాయి. ఆ తర్వాత చైనా జోడీ వ్యూహాన్ని మార్చింది. ర్యాలీలను త్వరగా ముగిస్తూ భారత జోడీపై ఒత్తిడి పెంచింది. దీంతో లియు షెంగ్‌షు–టాన్ నింగ్ 21-13తో రెండో గేమ్‌ను గెలుచుకున్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రపంచ నంబర్-1 జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత జోడీకి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా 21-8తో గేమ్‌ను, తద్వారా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
15 ఏళ్ల తర్వాత భారత మహిళల డబుల్స్‌కు పతకం
సెమీఫైనల్‌లో ఓడినా త్రిషా, గాయత్రి సాధించిన కాంస్య పతకం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన రెండో భారత మహిళల డబుల్స్ జోడీగా త్రిషా–గాయత్రి నిలిచారు. దీంతో భారత మహిళల డబుల్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం కోసం ఎదురుచూస్తున్న 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఫైనల్‌కు చేరలేకపోయినా, ప్రపంచ అత్యుత్తమ జోడీని ఎదుర్కొని చూపిన పోరాట స్ఫూర్తితో త్రిషా, గాయత్రి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఇక, త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ 2026 ఆసియా క్రీడల కోసం భారత బ్యాడ్మింటన్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన ఈ పతకంతో వారిపై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే ఆసియా క్రీడల్లో కూడా ఈ జోడీ భారత్‌కు మరో పతకం అందిస్తుందనే ఆశలు అభిమానుల్లో నెలకొన్నాయి.