
హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి ఏరియా అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మృతదేహాలను సహయక సిబ్బంది శిథిలాల కింద నుంచి వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని రెస్య్కూ చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మహబత్, ఉమేష్‌గా గుర్తించారు.
కుప్పకూలిన భవనంలో మృతులు టైల్స్ పని చేస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నారన్న అనుమానంతో ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ ఘటన స్థలంలో ముమ్మరంగా సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
గచ్చిబౌలి ప్రాంతంలోని అంజయ్య నగర్లో నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం (ఆగస్ట్ 22) మధ్యాహ్నం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలి పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడడంతో ఆ భవనం కూడా దెబ్బతిన్నది. ఏడంతస్తుల భారీ భవనం పేకమేడలా ఒక్కసారిగా కుప్పకూలిడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద నుంచి డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడంతస్తుల భవనం నిమిషాల వ్యవధిలో కుప్పకూలడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. నాలా పక్కనే కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం నిర్మించేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ అధికారులపై మండిపడుతున్నారు స్థానికులు.