Reading Time: 2 minutes
Bangladesh Pm Tarique Rahman India Visit Brics Summit Uncertain

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారతదేశ పర్యటనపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సమావేశానికి ముందే భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రెహమాన్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పర్యటనకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు హుమాయున్ కబీర్ వ్యాఖ్యానించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య పరస్పర విశ్వాసం, ఏకాభిప్రాయంతో కూడిన అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు.. భారత్ నుంచి గౌరవప్రదమైన ఆహ్వానం రావాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.

తారిఖ్ రెహమాన్ సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశాలపై బంగ్లాదేశ్‌లో చర్చ జరుగుతోంది. అయితే జాతీయ ప్రయోజనాలను స్పష్టంగా నిర్వచించకుండా ఉన్నతస్థాయి పర్యటనను తొందరపెట్టాల్సిన అవసరం లేదని హుమాయున్ కబీర్ పేర్కొన్నారు. బీఎస్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నిర్దిష్ట అంశాలపై ఏకాభిప్రాయం ఏర్పడి, పరస్పర విశ్వాసంతో కూడిన సరైన వాతావరణం ఏర్పడితే బ్రిక్స్ సదస్సులో పాల్గొనే విషయాన్ని ఢాకా సానుకూలంగా పరిశీలించవచ్చని కబీర్ తెలిపారు.

భారత్ ఏం చెప్పింది?

మరోవైపు భారత్ మాత్రం తారిఖ్ రెహమాన్ పర్యటనపై సానుకూల సంకేతాలు ఇచ్చింది. మంగళవారం భారత హైకమిషనర్ దినేశ్ త్రివేది మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, తారిఖ్ రెహమాన్ ఇద్దరూ కలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. రెహమాన్ భారత్‌కు వచ్చినప్పుడు ఆయనకు తగిన గౌరవప్రదమైన స్వాగతం లభించేలా చూస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు త్రివేది వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రముఖ వ్యాపారవేత్తలు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధుల కోసం భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

షేక్ హసీనాపై అభ్యంతరాలు

భారత్-బంగ్లాదేశ్ సంబంధాల భవిష్యత్తు, రెహమాన్ భారత్ పర్యటన.. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై భారత నాయకత్వం వైఖరిలో మార్పుపై ఆధారపడి ఉంటాయని కబీర్ అన్నారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన యువత నేతృత్వంలోని ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ఆ ఉద్యమం, అందులో జరిగిన త్యాగాల వాస్తవ పరిస్థితిని భారత్ సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భారత్‌లో ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ కార్యకలాపాలు, మీడియా కార్యక్రమాల్లో పాల్గొనడంపైనా కబీర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేర కేసులు లేదా శిక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు రాజకీయ, మీడియా వేదిక కల్పించడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఆరోపించారు. అయితే హసీనా పాల్గొన్న మీడియా కార్యక్రమంతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అందులో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను భారత్ సమర్థించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ అంశంపై బంగ్లాదేశ్ ఇప్పటికే భారత్‌కు దౌత్యపరమైన నిరసన తెలిపిందని కబీర్ వెల్లడించారు. భారత భూభాగం నుంచి బంగ్లాదేశ్ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఢాకా భావిస్తున్న అంశంపై దౌత్య మార్గాల ద్వారా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

షేక్ హసీనా అప్పగింత వివాదం

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో ప్రధానంగా షేక్ హసీనా అప్పగింత అంశం కూడా కొనసాగుతోంది. 2024లో నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రైబ్యునల్ 2025 నవంబర్‌లో హసీనాకు ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఆమెను భారత్ నుంచి అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. అయితే ఈ అప్పగింత అభ్యర్థనను వర్తించే చట్టాలు, నిర్దేశిత న్యాయ ప్రక్రియలకు అనుగుణంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది. షేక్ హసీనా అప్పగింత వివాదంతో పాటు భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఇతర విభేదాలు కూడా రెహమాన్ ప్రతిపాదిత భారత్ పర్యటనపై అనిశ్చితిని పెంచుతున్నాయి.