
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈరోజు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్,మంచిర్యాల, పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షాల అవకాశంతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు,మెదక్,కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఆగస్టు 24 న రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.